UPDATED 26th SEPTEMBER 2017 TUESDAY 11:30 AM
పెద్దాపురం : పట్టణ ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమీషనర్ బి.ఆర్. శేషాద్రి పేర్కొన్నారు. ప్రస్తుతం కురుస్తున్నవర్షాల కారణంగా ఈ సీజన్ లో డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, మెదడువాపు, అతిసార, కలరా, టైఫాయిడ్ మొదలైన వ్యాధులు తీవ్రంగా ప్రబలే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు పాటించాలన్నారు. చెత్తను రోడ్లు, కాలువలు, ఖాళీ ప్రదేశాలలో వేయకుండా మున్సిపల్ వాహనాలలో మాత్రమే వేయాలన్నారు. వారానికి ఒకసారైనా నీటి నిల్వలను పారబోసి, పాత్రలను శుభ్రం చేసుకోవాలని, చుట్టుపక్కల ఉన్న అన్ని మురికినీటికుంటలు, కాలువల్లో ఆయిల్ బాల్స్, కిరోసిన్, వెస్ట్ ఆయిల్ బాల్స్ వేసుకోవాలన్నారు. బయటి ప్రదేశములలో చెత్త లేకుండా చూసుకోవాలని, ముఖ్యంగా దోమతెరలను తప్పనిసరిగా ఉపయోగించాలని సూచించారు. మరుగుదొడ్లను మాత్రమే ఉపయోగించాలని, బహిరంగ మల,మూత్ర విసర్జన చేయకూడదని పేర్కొన్నారు. మరుగుదొడ్డి గాలి గొట్టానికి మెస్ ఏర్పాటు చేసుకొవాలన్నారు. భోజనానికి ముందు, మలవిసర్జన తరువాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, వ్యక్తిగతంగా పరిశుభ్రంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. శరీరంను పూర్తిగా కప్పి ఉంచే విధంగా దుస్తులు ధరించాలన్నారు. కిచెన్, బాత్ రూమ్స్, టాయిలెట్స్ శుభ్రంగా ఉంచుకోవాలని, ఇంటి లోపల పనికిరాని చెత్తను ఉంచుకోవద్దన్నారు. ఇంటి చుట్టుపక్కల పిచ్చిమొక్కలు లేకుండా చూసుకోవాలన్నారు. అలాగే కుళాయిలు వద్ద నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. ఇంటి సమీపంలో దోమల మందు పిచికారి చేసుకోవడం ద్వారా దోమలను నివారించవచ్చన్నారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు పట్టణ ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.







