* పీహెచ్ సీ ఆరోగ్యమిత్రలకు మంగళం పాడనున్న ప్రభుత్వం
* సచివాలయ ఏఎన్ఎంలకు అదనపు బాధ్యతలు అప్పగింత
* పీహెచ్ సీ ఆరోగ్యమిత్రలను నెట్ వర్క్ మిత్రలుగా మార్పు చేసే యోచనలో ప్రభుత్వం
* ఆయోమయంలో పీహెచ్ సీ ఆరోగ్యమిత్రలు
* పోరుబాట దిశగా అడుగులు
* పథకం నిర్వీర్యమైపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రజలు
UPDATED 5th DECEMBER 2020 SATURDAY 5:00 PM
కాకినాడ (రెడ్ బీ న్యూస్): పేదరికం కారణంగా ఏ ఒక్కరూ నాణ్యమైన వైద్యానికి దూరం కాకూడదన్న మంచి ఉద్దేశ్యంతో అందరికీ ఉచిత కార్పోరేట్ వైద్యం అందేలా మరింత మెరుగ్గా ఆరోగ్యశ్రీ పథకం అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ పథకాన్ని నిర్వీర్యం చేసే దిశగా పథకంలో నూతన మార్పులు తీసుకువచ్చింది. గ్రామస్థాయిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేస్తున్న ఆరోగ్య మిత్రలకు మంగళం పాడనుండడంతో సుమారు 13 సంవత్సరాలుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేస్తున్న ఆరోగ్యమిత్రలు కనుమరుగుకానున్నారు. పైగా వారిని నెట్ వర్క్ మిత్రలుగా మార్పు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు సైతం జారీ చేసింది. దీంతో పీహెచ్ సీ ఆరోగ్య మిత్రలతో పాటు ప్రజలు సైతం ఈ పథకం నిర్వీర్యం అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సచివాలయ హెల్త్ ఏఎన్ఎంలకు అదనపు బాధ్యతలు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సచివాలయ వ్యవస్థలో పనిచేస్తున్న సచివాలయ ఏఎన్ఎంలకు ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి అదనపు బాధ్యతలను అప్పగించనున్నారు. ఇప్పటికే వారికి తలకు మించిన పనుల భారం వారిపై ఉండడంతో వాటితోనే సతమతం అవుతున్నారు. అలాంటిది మళ్లీ పీహెచ్ సీ ఆరోగ్య మిత్రల బాధ్యతలను వారికే అప్పగించనుండడంతో వాళ్ళు తలలు పట్టుకుంటున్నారు. దీంతో వారిపై మరింత పనిభారం పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో పథకం ముందుకు సాగడం కష్టమని పలువురు భావిస్తున్నారు. కొన్ని పీహెచ్ సీల ఆరోగ్య మిత్రలను సమీపంలో ఉన్న సీహెచ్ సీలకు, 24 గంటల పీహెచ్ సీలకు బదిలీ చేసే ఆలోచనలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. గ్రామస్థాయిలో ప్రజలకు ఆరోగ్యశ్రీకి సంబంధించిన సమగ్ర సమాచారం స్థానికంగా ఉన్న ఆరోగ్యమిత్రలే ఇప్పటి వరకూ అందిస్తూ వస్తున్నారు. వారిని పట్టణ ప్రాంతాలకే బదిలీ చేస్తే గ్రామస్థాయిలో పథకంపై అవగాహన కల్పించే నాథుడే కరువు అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటి వరకూ నెట్ వర్క్ ఆసుపత్రులు రోగుల నుంచి డబ్బులు వసూళ్లు చేసినా, గ్రీవియన్సులు, అలాగే పథకానికి సంబంధించిన క్యాంపులను నిర్వహించడం వంటి వాటికి ఇప్పటి వరకూ పరిష్కారం ఆరోగ్య మిత్రలే బాధ్యతలను తీసుకుని వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తూ వస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే సుమారు నాలుగు సంవత్సరాల నుంచి మెడికల్ క్యాంపుల మాటే లేకుండా పోయింది. ఇప్పుడు పీహెచ్ సీ మిత్రలను నెట్ వర్క్ కు బదిలీ చేస్తే పథకం మరింతగా నిర్వీర్యం అయ్యే అవకాశం లేకపోలేదని పలువురు చెబుతున్నారు.
వేతనాల విషయంలో అన్యాయమే
ఇక ఆరోగ్యమిత్రలు గత పదమూడు సంవత్సరాలుగా పని చేస్తున్నా వారికి వేతనాల విషయంలో కూడా
తీవ్ర నిరాశే ఎదురవుతోందని పలువురు ఆరోగ్యమిత్రలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది చాలదన్నట్లు మళ్లీ కొత్తగా ఆరోగ్య మిత్రలను నియమించి వారిని కూడా నెట్ వర్క్ ఆసుపత్రుల్లో సర్దుబాటు చేస్తున్నారు. పైగా ఒక్కో ఆసుపత్రిలో ఇద్దరు చొప్పున ఆరోగ్య మిత్రలను నియమించేశారు. ఇప్పటికే ఉన్నవారికి ఉద్యోగ భద్రత లేకపోవడంతో పాటు వారి వేతనాలు గొర్రె తోక బెత్తెడు అనే చందంగా ఉండటంలో వారు తీవ్ర నిరుత్సాహంతో పనిచేయలా వద్దా అనే మీమాంసలో ఉంటున్నారు. కొన్నిచోట్ల అయితే ఆరోగ్య మిత్రలు వేతనాలు చాలక రాజీనామాలు సైతం చేసేస్తున్నారు. తమకు జీత భత్యాలు చాలా తక్కువగా ఉంటున్నాయని వారు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వారిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కనీస వేతన చట్టం ప్రకారం కూడా తమకు వేతనాలు అందడం లేదని వారు ఆవేదన చెందుతున్నారు. ఆరోగ్య మిత్రలకు నెలకు రూ.25 వేలు కనీస వేతనాన్ని అందించాలని పలుమార్లు ప్రభుత్వానికి సైతం వారు వినతి పత్రాలు అందచేయడంతో పాటు ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించారు. అయినా తమ వేతనాల విషయంపై ప్రభుత్వం కరగడం లేదని, తమ విషయంలో ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా తామంతా కలిసి ఎంతోమంది రోగులకు ఉచిత కార్పోరేట్ వైద్యాన్ని పొందే విధంగా చిత్తశుద్ధితో కష్టపడినట్లు ఆరోగ్య మిత్రలు పేర్కొంటున్నారు. తమ కృషి వల్ల గతంలో ఈ పథకానికి జాతీయస్థాయిలో ఎన్నో ఉత్తమ అవార్డులు వచ్చినట్లు ఆరోగ్య మిత్రలు గుర్తు చేసుకుంటున్నారు.







