UPDATED 4h SEPTEMBER 2019 WEDNESDAY 9:00 PM
సామర్లకోట (రెడ్ బీ న్యూస్): యువతలో చైతన్యం కల్పించడానికి యువజన సమైక్యతా శిబిరాలు ఎంతగానో దోహదపడతాయని ఎమ్మెల్సీ ఇళ్ళ వెంకటేశ్వరరావు అన్నారు. జిల్లా సెట్రాజ్ ఆధ్వర్యంలో స్థానిక టిటిడిసిలో రాష్ట్రస్థాయి యువజన సమైక్యతా శిబిరం బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు స్థానిక శాసన సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, సెట్రాజ్ సీఈవో విజయ భాస్కర్, మున్సిపల్ కమీషనర్ ఎం. ఏసుబాబులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి వివేకానందుని చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ భారతదేశంలో యువతలో చైతన్యం కల్పించడానికి యువజన సమైక్యత శిబిరాలు ఎంతగానో ఉపయోగపడతాయని, విద్య శాస్త్రీయ దృక్పథంతో ఉండాలని అన్నారు. భారత రాజ్యాంగానికి మతం లేదని, యువత చైతన్యం తెచ్చుకుని ప్రతీ అంశాన్ని గ్రహించి సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా జీవించాలని అన్నారు. ఎంఎల్ఏ నిమ్మకాల చినరాజప్ప మాట్లాడుతూ ప్రాంతాలు, సాంప్రదాయాలు వేరైనా జాతీయ భావం ఒకటేనని, యువత క్రమశిక్షణతో విద్యాభ్యాసం కొనసాగించి సమాజం పట్ల మంచి భావన కలిగి ఉండాలని అన్నారు. ప్రస్తుత కాలంలో యువత ఉన్నత విద్యను అభ్యసించినా నైపుణ్యత లేని కారణంగా ఇంటర్వ్యూలో విజయం సాధించలేకపోతున్నారని, ప్రతీ ఒక్కరూ స్కిల్ డవలప్ మెంట్ అలవాటు చేసుకోవాలని అన్నారు. సెట్రాజ్ సీఈవో విజయభాస్కర్ మాట్లాడుతూ ఐదు రోజులపాటు నిర్వహించు యువజన సమైక్య శిబిరాన్ని రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి 277 మంది యువతీ, యువకులు పాల్గొంటారని తెలిపారు. యువతీ, యువకుల్లో సమైక్యత భావాన్ని పెంపొందించడానికి ఈ శిబిరాలు యువజన క్రీడా సర్వీసెస్ శాఖ ఆధ్వర్యలో నిర్వహించబడుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సెట్రాజ్ మేనేజర్ కాశీ విశ్వనాథం, సెట్రాజ్ సిబ్బంది, వివిధ జిల్లాలకు చెందిన యువతీ, యువకులు, తదితరులు పాల్గొన్నారు.







