UPDATED 25th FEBRUARY 2019 MONDAY 7:00 PM
పెద్దాపురం: వచ్చే నెలలో జరుగనున్న తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలి సభ్యుని ఎన్నికలు సందర్భంగా అన్ని రాజకీయపార్టీలు ఎన్నికల కమీషన్ ప్రవర్తనా నియమావళిని అనుసరించాలని పెద్దాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయ పరిపాలనా అధికారి నాంచారయ్య తెలిపారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఏవో నాంచారయ్య అధ్యక్షతన రాజకీయపార్టీల ప్రతినిధులతో ఎంఎల్సీ ఎన్నికలపై డివిజన్ స్థాయి సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏవో నాంచారయ్య మాట్లాడుతూ మార్చి నెలలో జరిగే ఎంఎల్సీ ఎన్నికల షెడ్యూలును ఎన్నికల కమీషన్ విడుదల చేసిందని, ఈ నెల 25 నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని అన్నారు. ప్రభుత్వపరంగా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టరాదని, అలాగే ప్రచారానికి ముందస్తు అనుమతులు పొందాలని, ఎన్నికల ఖర్చు వివరాలను తెలియచేయాలని పేర్కొన్నారు. పెద్దాపురం డివిజన్ పరిధిలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 18,165 మంది ఓటర్లు ఉన్నారని, వీటికి గాను డివిజన్లో 20 పోలింగు కేంద్రాలను ఏర్పాటు చేశామని ఆయన రాజకీయ పార్టీలకు వివరించారు. నామినేషన్ పత్రాలను జిల్లా కలెక్టరు కార్యాలయంలో దాఖలు చేసుకోవచ్చని, పోలింగ్ వచ్చే నెల 22 తేదీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్లు రామ్ కుమార్, శ్రీనివాస్, డిప్యూటీ తహసీల్దార్ కృష్ణారావు, తదితరులు పాల్గొన్నారు.







