UPDATED 14th JULY 2018 SATURDAY 8:00 PM
పెద్దాపురం: కోర్టుల్లో కేసుల జాప్యాన్ని తగ్గించడంతో పాటు కక్షిదారుల సమయం వృథా కాకుండా సత్వర న్యాయం కోసమే లోక్ అదాలత్‌లు నిర్వహిస్తున్నట్లు సీనియర్ సివిల్ జడ్జి కె. రత్నకుమార్ అన్నారు. స్థానిక కోర్టు కాంప్లెక్స్ ఆవరణలో న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరుపార్టీలు క్షణికావేశంలో కేసులు పెట్టుకొని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయం వృథా చేసుకుంటున్నారని, ఈ లోక్ అదాలత్‌లలో ఇరు పార్టీలు ఆమోదయోగ్యమై రాజీపడే వీలున్న కేసులు పరిష్కారం చేయనున్నట్లు వివరించారు. లోక్ అదాలత్‌లను సద్వినియోగం చేసుకున్న కక్షిదారులకు సత్వర న్యాయంతో పాటు సమయం వృధా కాదని అన్నారు. పెద్దాపురం ఆర్డీవో ఎన్.ఎస్.వి.బి. వసంత రాయుడు మాట్లాడుతూ ఏలేరు ప్రాజెక్టు భూసంస్కరణలకు సంబంధించిన కేసులు పెండింగులో ఉన్నాయని, వీటిని పరిష్కరించడానికి ప్రభుత్వం ఇచ్చిన సూచనల ప్రకారం నష్టపరిహారం పూర్తి స్థాయిలో అందచేయడం జరుగుతుందని అన్నారు. ఈ లోక్ అదాలత్ లో కేసులు పరిష్కారానికి మూడు బెంచ్ లు ఏర్పాటు చేశామని, మొదటి బెంచ్ కి ఏడవ అదనపు జిల్లా జడ్జి ఎం. శ్రీనివాసాచారి, రెండవ బెంచ్ కి సీనియర్ సివిల్ జడ్జి కె. రత్నకుమార్, మూడవ బెంచ్ కి ఎ. అనిత అడిషనల్ జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ప్రిసైడింగ్ అధికారులుగా వ్యవహరించారు. ఈ లోక్ అదాలత్ ద్వారా 107 పెండింగు కేసులు, 76 బిఎస్ఎన్ఎల్ కేసులు రాజీకాగా, పెండింగ్ కేసుల్లో రాజీ మొత్తం రూ. 49,68,651/-, 76 బిఎస్ఎన్ఎల్ కేసులకు గాను రూ. 96,996 నగదు పరిష్కారమైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వేదుల సుబ్రహ్మణ్యం, న్యాయవాదులు మంగిపూడి సూర్యనారాయణ మూర్తి, మడికి రాంబాబు, ఆర్.వి. విజయలక్ష్మి, కక్షిదారులు, తదితరులు పాల్గొన్నారు.







