UPDATED 22nd JULY 2022 FRIDAY 09:23 PM
Droupadi Murmu: ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ప్రతిపక్ష అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై విజయం సాధించి రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఎంపీలు, ఎమ్మెల్యేల బ్యాలెట్ల లెక్కింపులో 64శాతానికి పైగా చెల్లుబాటు అయ్యే ఓట్లను పొందిన తర్వాత ముర్ము ప్రత్యర్థి సిన్హాపై అత్యధిక ఓట్ల తేడాతో గెలుపొందారు. రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలాఉంటే ద్రౌపది ముర్ము భారత 15వ రాష్ట్రపతిగా జూలై 25న ఉదయం 10:14 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భారతదేశ తొలి గిరిజన మహిళా రాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రపతి సచివాలయం శుక్రవారం ముర్ము ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించిన వివరాలను విడుదల చేసింది.
ఆదివారం ఉదయం 9:17 గంటలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తన అపార్ట్మెంట్ నుండి కమిటీ కార్యాలయం అయిన కావేరీకి బయలుదేరుతారు. ఉదయం 9:22గంటలకు రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ము నార్త్ కోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడ ఎయిడ్ డీ క్యాంప్ (ADC) రాష్ట్రపతికి అందజేసి కావేరీకి తోడ్కొని వెళ్తారు. అక్కడ కోవింద్ ఆమెకు స్వాగతం పలుకుతారు. ఉదయం 10:03గంటలకు రామ్‌నాథ్ కోవిద్, ద్రౌపది ముర్ము వాహన శ్రేణిలో పార్లమెంట్ హౌస్‌కు చేరుకుంటారు. పార్లమెంట్ గేట్ నంబర్ 5 వద్ద వారికి రాజ్యసభ చైర్పర్సన్, లోక్‌సభ స్పీకర్, భారత ప్రధాన న్యాయమూర్తి స్వాగతం పలుకుతారు. ఉదయం 10:05గంటలకు ద్రౌపది ముర్ము పార్లమెంట్ సెంట్రల్ హాల్‌కు వెళ్తారు.
ఉదయం 10:14గంటలకు నూతన రాష్ట్రపతికి సీజేఐ ప్రమాణ స్వీకార పత్రాన్ని అందజేస్తారు. ఉదయం 10:14: ద్రౌపది ముర్ము భారత ప్రధాన న్యాయమూర్తి చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ప్రమాణ స్వీకారం అనంతరం రాష్ట్రపతి సీటులో ఆసీనులవుతారు. ఉదయం 10:23 గంటలకు నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం చేస్తారు.10:35 గంటలకు వేడుకను ముగించాలన్న హోం సెక్రటరీ అభ్యర్థనకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఇదిలాఉంటే నూతన రాష్ట్రపతి ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు ఆదివారం సాయంత్రం పార్లమెంటు సెంట్రల్ హాల్లో పదవీ విరమణ చేసిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు వీడ్కోలు ఇవ్వనున్నారు. ఆదివారం రాష్ట్రపతి కోవింద్ జాతిని ఉద్దేశించి వీడ్కోలు ప్రసంగం చేయనున్నారు.







