* పెద్దాపురం సర్కిల్ ఇనస్పెక్టర్ వి. శ్రీనివాస్
UPDATED 18th OCTOBER 2019 FRIDAY 7:00 PM
పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): సమాజం కోసం పోరాడి అసువులు బాసిన అమరవీరుల త్యాగాలను ఎన్నటికీ మరువరాదని పెద్దాపురం పోలీస్ సర్కిల్ ఇనస్పెక్టర్ వి. శ్రీనివాస్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని స్థానిక రామారావుపేటలోని బ్రాహ్మణ కల్యాణ మండపంలో శుక్రవారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని సిఐ శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ సరిహద్దుల రక్షణలో రక్షణ సైన్యం ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుందో అంతకన్నా ఎక్కువగా అంతర్గత శత్రువుల నుంచి ప్రజలను కాపాడడంతో పోలీసులు ఎంతోమంది అమరులవుతున్నారని అన్నారు. సమాజం కోసం పోరాడి అసువులు బాసిన అమరవీరుల త్యాగాలను ఎన్నటికీ మరువరాదన్నారు. శాంతిభద్రతలను కాపాడడంతో 24 గంటలు అహర్నిశలు విధులను నిర్వహిస్తూ ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉండి అవసరమైతే ప్రాణాలను కూడా ఫణంగా పెట్టడానికి పోలీసులు విధి నిర్వహణలో ఉన్నారని పేర్కొన్నారు. నిత్యం ఎంతోమంది క్షతగాత్రులు, ఇతర వ్యాధిగ్రస్తులు వివిధ కారణాలతో రక్తం ఎక్కించాల్సిన పరిస్థితి రోగులకు వస్తుందని, సకాలంలో రక్తం లేక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని, వారి ప్రాణాలు కాపాడడంతో పోలీసులు భాగస్వాములుగా రక్తదానం చేస్తున్నారని అన్నారు. సమాజంలో ఎంతో మంది అనాథలు సకాలంలో రక్తం అందక చనిపోయిన దాఖలాలు ఉన్నాయని, రక్తం అందక చనిపోవడమనేది బాధాకరమని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు, కాన్పుల సమయంలో రక్తం చాలా అవసరమవుతుందని, ఆరోగ్యంగా ఉన్న ప్రతీ ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా వారం రోజుల పాటు పోలీసులు చేసిన సేవలను, త్యాగాలను స్మరించుకుంటూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. అనంతరం నిర్వహించిన రక్తదాన శిబిరంలో పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది, యువకులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ వెలుగుల సురేష్, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.







