UPDATED 23rd DECEMBER 2019 MONDAY 5:30 PM
పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): పెద్దాపురం పట్టణంలో గల స్థానిక మహారాణీ కళాశాలలో రిలయన్స్ ఫౌండేషన్, కళాశాల ఎన్ఎస్ఎస్, ఎన్‌సీసీ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో ప్రకృతి వైపరీత్యాలపై విద్యార్థులకు సోమవారం అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. రిలయన్స్ ఫౌండేషన్ ఏపీ స్టేట్ కోఆర్డినేటర్ ఎన్. చిట్టిబాబు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి మహారాణీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి. వీరయ్య చౌదరి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ప్రిన్సిపాల్ డాక్టర్ వీరయ్య చౌదరి మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అప్రమత్తతతో మెలగాలని, అలాగే ప్రకృతి వైపరీత్యాలను ముందుగా గుర్తించేందుకు నేడు అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. ఇటువంటి శిక్షణ తీసుకోవడం ద్వారా ముందస్తుగా అస్థి, ప్రాణ నష్టాలను చాలా వరకూ నివారించవచ్చని విద్యార్థులకు ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఇండియన్ నేవీ కోస్ట్ గార్డ్ ఎస్. రాజు విద్యార్థులకు ప్రకృతి వైపరీత్యాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌సీసీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఎం. కృష్ణారావు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు డాక్టర్ కె. నాగేశ్వరరావు, ఎం. తాతాజీ, రిలయన్స్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ మేనేజర్ బర్రే నాగేశ్వరరావు, ప్రోగ్రాం సపోర్టర్ బచ్చల శ్రీనివాస్, ఇండియన్ రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ ప్రకాష్, సత్యనారాయణ, ఎ. నరేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.







