UPDATED 20th DECEMBER 2019 FRIDAY 9:00 PM
సామర్లకోట(రెడ్ బీ న్యూస్): సామర్లకోట మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులు పురోగతిపై పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప శుక్రవారం అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం పట్టణంలో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ పెండింగులో ఉన్నాయని, వాటిని సత్వరం పూర్తి చేయాలని అన్నారు. పాఠశాలలో సచివాలయం ఏర్పాటు చేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయని, అక్కడ సచివాలయం ఏర్పాటు వల్ల విద్యార్థులకు ఎంతో ఇబ్బందిగా ఉంటుందని అన్నారు. ప్రజలకు, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సచివాలయాలు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మురళీధరరెడ్డితో ఫోన్లో మాట్లాడి వివరించారు. పారిశుధ్య నిర్వహణలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలకు త్రాగునీటి ఎలాటి ఆటంకం లేకుండా చూడాలని ఆదేశించారు. మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న వార్డు సచివాలయాలు, మౌలిక వసతులు, వాలంటీర్లు పనితీరు వంటి వివిధ అంశాలపై అధికారులతో చర్చించారు. ప్రజలకు అందుతున్న సేవలు ప్రభుత్వ పాఠశాలల పనితీరు వంటి అంశాలపై మున్సిపల్ కమీషనర్ ఎం ఏసుబాబు వివరించారు. అనంతరం సామర్లకోట వ్యవసాయ మార్కెటింగ్ కమీటీ కార్యాలయంలో అధికారులతో వ్యవసాయ మార్కెటింగ్ చేపట్టే వివిధ రకాల పనుల పురోగతి గురించి సమీక్షించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డిఇ చదలాడ రామారావు ఏడీ ప్రభాకరరావు, టిడిపి పట్టణ అధ్యక్షుడు అడబాల కుమారస్వామి, కార్యదర్శి బడుగు శ్రీకాంత్, కంటే జగదీష్ మోహన్, అందుగుల జార్జి చక్రవర్తి, తదితరులు పాల్గొన్నారు.







