* రాజమహేంద్రవరం ఎంపీ భరత్ రామ్
UPDATED 19th JUNE 2020 FRIDAY 6:30 PM
రాజమహేంద్రవరం(రెడ్ బీ న్యూస్): స్థానిక గోదావరి గట్టు పద్మావతి ఘాట్ వద్ద పర్యాటక శాఖ జల విహార నియంత్రణ కేంద్రాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం అమరావతి నుంచి ఆన్ లైన్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ కంట్రోల్ రూమ్ ప్రారంభోత్సవానికి సంబంధించిన శిలాఫలకాన్ని జల విహార నియంత్రణ కేంద్రం ఆవరణలో రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ రామ్ ఆవిష్కరించారు. అనంతరం ఎంపీ భరత్ మీడియాతో మాట్లాడుతూ నదీతీర, సముద్రతీర ప్రాంతాల్లో జల విహార యాత్రలో ఏ ఒక్కరూ ఎలాంటి ప్రమాదానికి గురి కాకుండా ముఖ్యమంత్రి రాష్ట్రంలో జలవిహార్ నియంత్రణ కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారని అన్నారు. ఈ కంట్రోల్ రూముల్లో ప్రయాణికుల పూర్తి సమాచారంతో పాటు జిపిఎస్ పద్ధతి ద్వారా రక్షణ చర్యలు చేపడతారని, ప్రతీ ఒక్కరూ స్వీయ రక్షణ చర్యలు తీసుకోవాలని, విహార యాత్రకు వెళ్లే పర్యాటకులు ఈ కంట్రోల్ రూములో పూర్తి సమాచారం అందించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం సబ్-కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, ఆకుల వీర్రాజు, కె. సత్య, పిల్లి నిర్మల, మార్గాని సురేష్, మజ్జి అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.







