UPDATED 7th DECEMBER 2018 FRIDAY 7:00 PM
రాజానగరం: గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (గైట్) కళాశాలను సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ (పుట్టపర్తి) వైస్ ఛాన్సలర్ డాక్టర్ కె.బి.ఆర్. వర్మ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా చైతన్య విద్యా సంస్థల చైర్మన్ కెవివి సత్యనారాయణ రాజు (చైతన్యరాజు) అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో పరిశోధనలతో భావి ప్రగతి అనే అంశంపై గైట్ విద్యా సంస్థల ప్రాంగణంలో కళాశాల విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులతో డాక్టర్ వర్మ చర్చించారు. ఈ సందర్భంగా డాక్టర్ వర్మ మాట్లాడుతూ ఇంజినీరింగులోని అన్ని విభాగాలలో మెటీరియల్ సైన్స్ కీలకపాత్ర వహిస్తుందని, అందుకు విద్యార్థులు వారు ఉపయోగించే పరికరాలు వీటితో తయారుచేస్తారో తెలుసుకోవలసిన ఆవశ్యకత ఎంతో ఉందని అన్నారు. ప్రస్తుత సమాజానికి పర్యావరణం, ఆరోగ్యం, ఎనర్జీ రంగాల్లో విస్తృత పరిశోధనలు చాలా కీలకమని, అందుకు బోధనా విధానంలో పరిశోధనాంశాలకు పెద్దపీట వేయాలని, తద్వారా విద్యార్థులు జ్ఞానసంపదతో పాటు మంచి భవిష్యత్తు సాధిస్తారని తెలిపారు. మెటీరియల్స్ పై సరైన విశ్లేషణ ద్వారా ఎలక్ట్రానిక్స్, అంతరిక్షం, కమ్యూనికేషన్స్, ఆరోగ్యం, పర్యావరణం, ఎనర్జీ, రాడార్, నిర్మాణ రంగాల్లో ఏవిధంగా ప్రగతి సాధించవచ్చో ప్రెజెంటేషన్స్ ద్వారా వివరించారు. భారతదేశంలో ఐఐఎస్ఈ వంటి ప్రముఖ విద్యా సంస్థలు, సత్యసాయి విశ్వవిద్యాలయాలలో ఈ అంశాలపై జరుగుతున్న పరిశోధనలను ఆయన వివరించారు. చైతన్య విద్యా సంస్థల చైర్మన్ కెవివి సత్యనారాయణ రాజు (చైతన్యరాజు) మాట్లాడుతూ పరిశోధనలపై మరింత పరిణితి సాధించేందుకు ఇటువంటి సదస్సులు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ వర్మను చైతన్యా విద్యా సంస్థల చైర్మన్ సత్యనారాయణరాజు, గైట్ మేనేజింగ్ డైరెక్టర్ కె. శశికిరణ్ వర్మ దుశ్శాలువాతో ఘనంగా సన్మానించి జ్ఞాపిక అందచేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్స్ డాక్టర్ టివి ప్రసాద్, డాక్టర్ ఎస్ఎస్ఎన్ రాజు, డాక్టర్ పిఎంఎంఎస్ శర్మ, వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ ఎస్. మూర్తి, డాక్టర్ ఎన్. లీలావతి, వివిధ విభాగాల అధిపతులు, తదితరులు పాల్గొన్నారు.







