UPDATED 28th SEPTEMBER 2017 THURSDAY 11:00 PM
రాజమహేంద్రవరం : రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో దసరా పండుగ సందర్భంగా స్థానిక కోటిలింగాల రేవు వద్ద గోదావరి నదిలో ఏర్పాటు చేసిన గోదావరి డ్యాన్స్ అండ్ లైట్స్ వేడుకలు గురువారం కళాకారులు నిర్వహించిన ప్రదర్శనలతో అట్టహాసంగా ముగిసాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాజమహేంద్రవరం ఎంపీ మాగంటి మురళీమోహన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళలకు నిలయమైన రాజమహేంద్రవరం నగరంలో ఇటువంటి వేడకలు జరగడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం కేరళ కళాకారులు ప్రదర్శించిన నృత్యరూపకాలు, మహాభారతంలో కుంతి, కర్ణుడు మధ్య జరిగిన ఘటనలను మోహినియాట్టం పేరుతో సాగిన నృత్యరూపకం,.అలాగే మహిళలు కథాకళి నాట్యం, కత్తి విన్యాసాలు, పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు పొందిన రాజా, రాధారెడ్డిల కుమార్తెలు యమున, భావన బృందం చేసిన కూచిపూడి నృత్య ప్రదర్శన, విశాఖపట్నానికి సాయి కళానికేతన్ ఆధ్వర్యంలో భక్తప్రహ్లాద నాటకం, సింహా, శ్రీరామ్ భవ్య బృందం ఆలపించిన సినీ గీతాలు, అలాగే వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారుల ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆకుల సత్యనారాయణ, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, నగర మేయర్ పంతం రజనీశేషసాయి, అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు .







