UPDATED 5th NOVEMBER 2018 MONDAY 9:00 PM
సామర్లకోట: శబ్దకాలుష్యం లేకుండా ఆనంద సంతోషాల దివ్వెల పండుగ దీపావళిని ప్రతీ ఒక్కరూ పర్యావరణ పండుగగా జరుపుకోవాలని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత స్థానిక బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు తోటకూర సాయిరామకృష్ణ పేర్కొన్నారు. పాఠశాల నేషనల్ గ్రీన్ కోర్ ఆధ్వర్యంలో హరిత దీపావళిని జరుపుకోవాలని కోరుతూ ఉపాధ్యాయులు విద్యార్థులతో పురవీధుల గుండా సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. స్వచ్ఛ దీపావళిని జరుపుకోవాలని, హాని కలిగించే బాణాసంచాను విడనాడాలని శబ్ద కాలుష్యం అరికట్టాలని కోరుతూ ప్లే కార్డులతో ర్యాలీని చేపట్టారు. గాలి, నీరు, భూమి పర్యావరణం వాతావరణంలో మార్పులు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయని, దీనిపై ప్రతీ ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని వారు కోరారు. బాణసంచాలో సోడియమ్ నైట్రేట్, జింకు, లెడ్, మెగ్నీషియం వంటి రసాయనాలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని అన్నారు. ఇంటిల్లిపాది సంప్రదాయానికి పెద్ద పీట వేస్తూ ఆనంద దీపావళి జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ టీచర్ ఎ.ఎల్.వి. కుమారి, ఉపాధ్యాయులు కె. శ్రీనివాస్, జి. గోవిందు, కె.వి.వి. సత్యనారాయణ, డి.వి.ఆర్.ఎం. వల్లి, బి. శ్రీలక్ష్మి, చంద్రమోహన్, కె. అరుణ, భార్గవి, తదితరులు పాల్గొన్నారు.







