UPDATED 10th APRIL 2018 TUESDAY 7:00 PM
సామర్లకోట: గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర క్రీడా శాఖా మంత్రి కొల్లురవీంద్ర అన్నారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పట్టణం స్థానిక జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో రూ.2 కోట్ల10 లక్షలతో నిర్మించిన ఎన్.టి.ఆర్ క్రీడా వికాస కేంద్రాన్ని మంత్రి కొల్లు రవీంద్ర, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పతో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి రవీంద్ర మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు క్రీడాకారులను ప్రోత్సహించడంలో ముందుంటారని, ప్రతి నియోజకవర్గంలో ఎన్.టి.ఆర్ క్రీడా వికాస కేంద్రాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాలకు క్రీడా వికాస కేంద్రాలను వర్తింపు చేస్తున్నామని, ఇందులో భాగంగానే బడ్జెట్లో క్రీడలకు రూ. 300 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. నియోజకవర్గంలో క్రీడా వికాస కేంద్రాలు పూర్తయిన తరువాత మండలాల్లో కూడ క్రీడా వికాస కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమాఖ్య ఆంధ్రప్రదేశ్ లో క్రీడలను ప్రోత్సహించడం వల్ల గోపీచంద్, సింధు ఒలెంపిక్స్ లో పేరు ప్రతిష్టలు తీసుకువచ్చారని అన్నారు. ఇటీవలే కామన్ వెల్త్ క్రీడల్లో స్టువర్ట్ పురంకు చెందిన రాహుల్ గెలిచినందుకు రూ.15 లక్షలు ముఖ్యమంత్రి అందచేశారని, రాష్ట్ర ప్రభుత్వం జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో రాణించాలనే ఉద్దేశ్యంతో క్రీడాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ నియోజకవర్గంలో క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఎన్.టి.ఆర్ క్రీడా వికాస భవనాలను నిర్మస్తున్నామని, ఇందులో భాగంగా జూనియర్ కళాశాల ఆవరణలో రూ. 2 కోట్ల 10 లక్షలతో భవనాన్ని ఏర్పాటుచేసినట్లు మంత్రి వెల్లడించారు. ఈ భవనంలో యోగా, వ్యాయామశాల, క్రీడాకారుల విశ్రాంతి గదులు, క్రీడలకు సంబంధించిన ఆటవస్తువులు ఉన్నాయని దీనితో పాటుగా కోచ్ లు కూడ ఉంటారని, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని క్రీడల్లో రాణించి రాష్ట్రానికి పేరు, ప్రఖ్యాతులు తీసుకురావాలన్నారు. అనంతరం మంత్రులు విధ్యార్ధినులచే నిర్వహించిన యోగాసనాలను తిలకించారు. క్రీడామంత్రి కొల్లు రవీంద్ర వ్యాయామం అందరిని ఆశ్చర్యపర్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ జ్యోతుల నవీన్ కుమార్, శాప్ వైస్ చైర్మన్, ఎం.డి నల్లపురాజు బంగార్రాజు, మన్యం చంద్రరావు, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, కంటే జగదీష్ మోహన్, మున్సిపల్ వైస్ చైర్మన్ రవిచంద్ర, డి.ఆర్ డి.ఎ పిడి ఎస్. మల్లిబాబు, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శారదాదేవి, ఆర్డీవో ఎల్. రఘుబాబు, తహసీల్దార్ ఎల్. శివకుమార్, జిల్లా కోచ్ పోతుల సాయి ప్రసాద్, ఎం.టి.ఆర్. వికాస కేంద్రం కోచ్ కె. కృపావతి, వార్డు కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.







