UPDATED 31st MARCH 2018 SATURDAY 6:00 PM
పెద్దాపురం: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణం స్థానిక కోర్టు కాంప్లెక్స్ ఆవరణలో ఏడవ అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు, పార్కును ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి సి. ప్రవీణ్ కుమార్ శనివారం ప్రారంభించారు. తొలుత బార్ అసోసియేషన్ సభ్యులు న్యాయమూర్తికి పూర్ణకుంభంతో వేదపండితులచే ఘనస్వాగతం పలికారు. అనంతరం పోలీస్ వందనం స్వీకరించారు. ఆరవ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి ఎన్. నరసింహాచార్యులు అధ్యక్షతన జరిగిన సభలో జస్టిస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఎంతోకాలంగా పెద్దాపురంలో ఏడవ అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు కోసం అర్జీ చేసుకోవడం జరిగిందని, పరిపాలనా సమస్యల వల్ల ఆలస్యం జరిగిందన్నారు. కోర్టుల ఏర్పాటుపై 2017లో గవర్నమెంట్ నోటిఫికేషన్ జారీచేసిందని, 500 కేసులు పైబడి పెండింగ్ లో ఉన్న చోట కోర్టులు ఏర్పాటు చేయమని ఆదేశాలు వచ్చాయని అన్నారు. ఈ ఆదేశాల ప్రకారం 2018లో హైకోర్టు మంజూరు చేసిందని, దీని ద్వారా కాకినాడ నుంచి పెద్దాపురం బదిలీ చేయడం జరిగిందన్నారు. 2018 ఫిబ్రవరిలో పెద్దాపురంలో కోర్టు ఏర్పాటుకు ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగిందన్నారు. బార్ అసోసియేషన్ కోరిన ప్రకారం ఈ కోర్టును పర్మనంట్ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జూనియర్ న్యాయవాదులు నీతి, నిజాయితీలతో వృత్తి కొనసాగిస్తే భవిష్యత్ లో మంచి న్యాయవాదిగా ఎదగడానికి అవకాశం ఉంటుందని, మనీ మైండ్ తో పనిచేస్తే మంచి అవకాశాలు కోల్పోతారన్నారు. కక్షిదారులు ఈ జిల్లా కోర్టు పెద్దాపురం రావడం వల్ల వ్యయప్రయాసలకు లోనుకాకుండా ఉంటుందన్నారు. అనంతరం హైకోర్టు న్యాయమూర్తిని బార్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సన్మానించి మెమెంటో అందచేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి ఎన్. తుకారాంజీ, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పైడిపల్లి సూర్యనారాయణ మూర్తి (చిన్ని), వైస్ ప్రెసిడెంట్ పేరిశెట్టి మృత్యుంజయరావు, జనరల్ సెక్రటరీ దారా శ్రీనివాస్, ట్రెజరర్ ఎ.వి. జనార్దన్, జాయింట్ సెక్రటరీ కర్రా ఎలీషారావు, లైబ్రరీ సెక్రటరీ ఆర్. కామేశ్వరరావు, ఆర్డీవో వి. విశ్వేశ్వరరావు, తహసీల్దార్ గోగుల వరహాలయ్య, మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, వైస్ చైర్మన్ కొరుపూరి రాజు, ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ బొడ్డు బంగారుబాబు, ఆత్మా చైర్మన్ కలకపల్లి రాంబాబు (రాము), పట్టణ టిడిపి కార్యదర్శి తూతిక రాజు, న్యాయవాదులు సాదే నరసింహారావు, కె.వి. రాయుడు, కందుల వెంకట చలం, దేవులపల్లి రవికుమార్, ఎన్.వి.ఎస్. మూర్తి(బాలు), బొడ్డు లక్ష్మణరావు, మడికి రాంబాబు, ఎస్.కె. వల్లిబాబు, ముమ్మన సోమరాజు, బి.వి.పద్మాసిని, తదితరులు పాల్గొన్నారు.







