UPDATED 22nd SEPTEMBER 2018 SATURDAY 6:30 PM
రాజానగరం: గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (గైట్) కళాశాలలోని ప్లేస్ మెంట్, ఎంసిఎ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో విమెన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇన్ డిజిటల్ స్పేస్ అనే అంశంపై శుక్రవారం అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఈఎన్ఎఫ్ ల్యాబ్స్ వ్యవస్థాపక చైర్మన్ అనిశెట్టి అనిల్ ఫోన్లలో డేటా హ్యాక్ చేసినపుడు కాపాడుకునే విధానం, ట్రోజెన్ వైరస్ గురించి వివరించారు. ఇంటర్నెట్ పరిమితంగా ఉపయోగించాలని విద్యార్థినులకు సూచించారు. సాధ్యమైనంతవరకూ ఫోటోలను గ్రూపుల్లో పోస్ట్ చేయడాన్ని తప్పించుకోవాలని అన్నారు. బ్లాక్ మెయిల్ చేస్తూ ఎవరైనా అపరిచితులు ఫోన్ చేస్తే ముందుగా ఆ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియచేయాలని, అనంతరం సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. సైబర్ సెక్యూరిటీలో ఆసక్తి గలవారికి ఇంటర్న్ షిప్ శిక్షణ ఇవ్వగలమని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిపివో కె. వల్లీమాధవి, ఎంసిఎ విభాగాధిపతి ఆర్. తమిళ్ కోడి, అసోసియేట్ ప్రొఫెసర్ పవనకుమారి, తదితరులు పాల్గొన్నారు.







