UPDATED 20th JULY 2018 FRIDAY 9:00 PM
సామర్లకోట: మాతా, శిశుమరణాలు తగ్గించే దిశగా ఆరోగ్య సిబ్బంది కృషి చేయాలని డిఐవో డాక్టర్ మల్లిక్ పేర్కొన్నారు. స్థానిక కమ్యూనిటీ హెల్త్ హెల్త్ సూపరెంటెండెంట్ డాక్టర్ పి. చందర్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో గర్భిణీ స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలపై ఆరోగ్యసిబ్బందికి తగు సూచనలు, సలహాలు అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ మల్లిక్ మాతా శిశు మరణాలు అరికట్టడం, ఆరోగ్యకేంద్రంలో నివేదికలు రూపొందించే విధానంపై అవగాహన కల్పించారు. ప్రతీ గర్భిణీ నాలుగుసార్లు వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఆరోగ్యకరంగా ఉండాలని, గర్భిణులను గుర్తించి మెరుగైన వైద్య సేవలు అందించేలా చూడాలని, వారికి వ్యాధి నిరోధక టీకాలు, ఈసీజీ పరీక్షలు చేయడం, తదితర పూర్తి వివరాలతో ఎప్పటికప్పుడు నివేదికలు రూపొందించాలని అన్నారు. డాక్టర్ చంద్రరావు మాట్లాడుతూ ఇప్పటికీ పట్టణంలో 308 మంది గర్భిణీ స్త్రీలను గుర్తించడం జరిగిందని, ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో వైద్య పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టామని, సమస్యాత్మకమైన గర్భిణులను గుర్తించి ప్రత్యేక వైద్య సహాయం అందిస్తామని అన్నారు. మున్సిపల్ కమీషనర్ సి.హెచ్. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మాతాశిశు మరణాలను తగ్గించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని, గర్భిణి అయిన దగ్గర నుంచి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, అలాగే ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ లలిత, రమ్య, అశోక్, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, తదితరులు పాల్గొన్నారు.







