ఎన్నికల ప్రక్రియ పగడ్బందీగా నిర్వహించాలి

UPDATED 2nd MARCH 2019 SATURDAY 6:00 PM

పెద్దాపురం: ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల  శాసనమండలి సభ్యుని ఎన్నిక ప్రక్రియను ఎన్నికల అధికారులు పగడ్బందీగా నిర్వహించాలని పెద్దాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి ఎన్.ఎస్.వి.బి. వసంతరాయుడు డివిజన్ పరిధిలోని ఎంపిడివో, మున్సిపల్ కమీషనర్లను ఆదేశించారు. ఈనెల 22వ తేదీన జరగనున్న పట్టభద్రుల శాసనమండలి సభ్యుని ఎన్నికల పోలింగుని పురస్కరించుకుని స్థానిక ఆర్డీవో కార్యాలయంలో డివిజన్ స్థాయి సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్డీవో వసంతరాయుడు మాట్లాడుతూ పెద్దాపురం డివిజన్ పరిధిలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 18,165 మంది ఓటర్లు ఉన్నారని, వీటి నిమిత్తం డివిజన్ లో 20 పోలింగు కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఎలక్షన్ కమీషన్ ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని రిటర్నింగు అధికారులు పోలింగు కేంద్రాలను సందర్శించాలని తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించి ప్రభుత్వాధికారులు  రాజకీయ నాయకుల ఇళ్ళకు వెళ్లరాదని, అలాగే ఏపార్టీకి కూడా అధికారులు అనుకూలంగా, వ్యతిరేకంగా కూడా ఉండరాదన్నారు. జాతీయ నాయకుల ఫొటోలు తప్ప పోలింగు కేంద్రాలలో ఎలాంటి రాజకీయ పార్టీల నాయకుల చిత్రాలు ఉండకూడదన్నారు. పబ్లిక్ స్థలంలో పార్టీల బేనర్స్, హోర్డింగ్సు ఉంటే వాటిని వెంటనే తొలగించాలన్నారు. పార్టీపరంగా పబ్లిక్ సమావేశాలు నిర్వహిస్తే ముందుగా పోలీసుశాఖ అనుమతి పొందాలని, వీటికి సంబంధించిన ఖర్చును కూడ పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికలకు సంబంధించి దినపత్రికల్లో ఏవిధమైన ప్రతికూల వార్తలు వచ్చినా వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎన్నికలలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ప్రచారంలో భాగంగా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటలు  వరకు మాత్రమే ఎన్నికల కమీషన్ అనుమతిని మంజూరు చేసిందని, ఆ పరిమితిని దాటి ప్రచారం చేస్తే కేసులు నమోదు చేయాలన్నారు. గ్రామాల్లోని పంచాయతీ కార్యదర్శి, వారి సిబ్బంది ఫోన్ నెంబర్లు పోలింగు అధికారుల వద్ద ఉండాలన్నారు. ఎన్నికల కమీషన్ అభ్యర్థి ఖర్చులకు సంబంధించి రేట్లను నిర్ణయించిందని, వాటి ఆధారంగా ఖర్చులు నమోదు చేయాలని, అలాగే ఎన్నికలకు సంబంధించి పనులు నిమిత్తం ఎన్నికల అధికారి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా వీడియో చిత్రీకరించాలన్నారు. ఎక్సైజ్ అధికారుల ఫోన్ నెంబర్లు కూడ ఎన్నికల అధికారుల దగ్గర ఉండాలన్నారు. ఎన్నికల అధికారులు సార్వత్రిక ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఎన్నికల ప్రక్రియ పూర్తియ్యే వరకు వారికి కేటాయించిన మండల హెడ్ క్వార్టర్ లో  నివాసం ఉండాలని చెప్పారు. గతం కంటే ప్రస్తుత ఎన్నికలు ప్రక్రియలో ఎలాంటి సమస్యలు లేకుండా  ఎలక్షన్ కమీషన్ పూర్తిస్థాయిలో టెక్నాలజీని ఉపయోగించి పగడ్బందీగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల సందర్భంగా ప్రతీ ప్రభుత్వ ఉద్యోగి ఎన్నికల కమీషన్ అధీనంలో పనిచేయవలసి ఉంటుందని చెప్పారు. అనంతరం ఇవిఎం, వివిప్యాట్లు కంట్రోల్ యూనిట్లు పనితీరుపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం, సామర్లకోట మున్సిపల్ కమీషనర్లు బి.ఆర్. శేషాద్రి, నాగేంద్రకుమార్, పెద్దాపురం ఎంపీడీవో ఉమామహేష్, డివిజన్ పరిధిలోని ఎంపీడీవోలు, ఈవోపీఆర్డీలు, ఏవో నాంచారయ్య, ఎలక్షన్ డిటి రామ్ కుమార్, ఆర్.ఐ రవితేజ, తదితరులు పాల్గొన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us