UPDATED 17th FEBRUARY 2018 SATURDAY 7:00 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ క్యాంపస్ లో ఈ నెల 14 నుంచి సీజర్ ప్రో కార్టింగ్ ఛాంపియన్ షిప్-2018 పేరిట నిర్వహిస్తున్న జాతీయస్థాయి గో-కార్ట్ రేసింగ్ పోటీలు శనివారం ఘనంగా ముగిసినట్లు ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. నేడు జరిగిన ఫైనల్ పోటీలకు ముఖ్య అతిధులుగా మాజీ ఐ.ఎ.ఎస్.అధికారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఫౌండర్ డైరెక్టర్ డాక్టర్ కె. లక్ష్మీనారాయణ, డిప్యూటీ చీఫ్ ఇనస్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఎం.వి. శివకుమార్ రెడ్డి, ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి హాజరైనారు. మధ్యాహ్నం 12 నుంచి రెండు గంటల వరకు జరిగిన ఫైనల్ పోటీల్లో విజేతగా కర్ణాటక రాష్ట్రంలోని పుత్తూరుకు చెందిన వివేకానంద కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి విజేతగా ప్రథమస్థానంలో, రన్నరప్ గా శ్రీనిధి ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, హైదరాబాద్, ఎండ్యూరెన్స్ విన్నర్ గా ఆదిత్య కళాశాల విద్యార్థులు గెలుపొందారు. అలాగే బెస్ట్ డిజైన్, బెస్ట్ ఇన్నోవేషన్, యాక్సిలరేషన్, స్లెడ్జి ఫుల్, తదితర విభాగాల్లో ఆదిత్య కళాశాల విద్యార్థుల బహుమతులు కైవసం చేసుకున్నారు. ఈ పోటీలను విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులు, అధ్యాపకులు, వాలంటీర్లు, వివిధ కళాశాలల టీములను ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిలి శేషారెడ్డి అభినందించారు. ముఖ్య అతిథులు డాక్టర్ కె. లక్ష్మీనారాయణ, ఎం.వి. శివకుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ పోటీల వల్ల విద్యార్థుల్లో దాగివున్న సృజనాత్మక శక్తి ద్విగుణీకృతమవుతుందని, జాతీయస్థాయి పోటీలను విజయవంతంగా నిర్వహించిన ఆదిత్య యాజమాన్యాన్ని, ఇందులో పాల్గొన్న విద్యార్థులను అభినందించారు. సీజర్ ఇన్నోవేషన్ కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ ఆదిత్య సామర్థ్యం మొదటిసారి నిర్వహించినప్పుడే గ్రహించామని, అన్ని వసతులు సమకూర్చడంలో ఆదిత్య కు సాటి మరెవ్వరు లేరని, ఎంతో స్పోర్టివ్ గా స్నేహపూర్వక వాతావరణంలో పోటీలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి మాట్లాడుతూ గత వారం రోజులుగా ఎంతో శ్రమకోర్చి ఈ పోటీలను విజయవంతం చేసిన ప్రతీ ఒక్కరికీ అభినందనలు తెలియ చేస్తున్నామన్నారు. అనంతరం వివిధ కేటగిరీల్లో పాయింట్లు ఆధారంగా విజేతలకు ముఖ్య అతిథులు చేతుల మీదుగా జ్ఞాపిక, ప్రశంసాపత్రం, నగదు బహుమతులు అందచేశారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలల ప్రిన్సిపాల్స్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ టి.కె. రామకృష్ణారావు , ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, సీజర్ కంపెనీ ప్రతినిధులు డి. అంజన్ ప్రసాద్, శ్రీకాంత్ రెడ్డి, ఎం.వి. సాయి కిరణ్, వైస్ ప్రిన్సిపాల్స్, మెకానికల్ విభాగాధిపతులు, తదితరులు పాల్గొన్నారు.







