UPDATED 23rd OCTOBER 2017 MONDAY 8:00 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో టీమ్ ఇండియా మాజీ క్రికెటర్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సాగి లక్ష్మీ వేంకటపతి రాజు సోమవారం కళాశాలలో సందడి చేశారు. ఈ సందర్భంగా కళాశాల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థులనుద్దేశించి వెంకటపతిరాజు మాట్లాడుతూ నిరంతర కృషి, కఠోర పట్టుదల లేనిదే ఏదీ సులభంగా లభించదని, లక్ష్యసాధన కోసం ప్రతీ ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఇండియా తరఫున ఆడడం, ఇండియా ట్రోఫీ, ఇండియా టీం దుస్తులు ధరించడం తన జీవితంలో మరిచిపోలేని మధుర ఘట్టాలని విద్యార్థులతో తన అనుభవాలను పంచుకున్నారు. నిరంతర సాధనతోనే ఏదైనా సాధ్యపడుతుందని విద్యార్థులకు సూచించారు. అనంతరం కళాశాల వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి మాట్లాడుతూ భారత క్రికెట్ టీమ్ లో దేశానికి సేవలందించిన వేంకటపతి రాజు మన కళాశాలకు రావడం ఆనందదాయకమన్నారు. వేంకటపతి రాజుతో కరచాలనం చేసేందుకు విద్యార్థులు ఎగబడ్డారు. అలాగే కళాశాల యాజమాన్యం వెంకటపతిరాజును పూల మాలలతో, దుశ్శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి కిరణ్ రాజు, కళాశాల ప్రిన్సిపాల్స్ ప్రొఫెసర్ ఎం. శ్రీనివాసరెడ్డి, డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, తదితరులు పాల్గొన్నారు.







