UPDATED 28th MAY 2018 MONDAY 9:00 PM
సామర్లకోట: పారిశుద్ధ్య సిబ్బంది కొరత వల్ల డ్రైన్లలో పూడిక తీయడానికి గత నెలలో ప్రభుత్వం ఇచ్చిన డ్రైనేజీలు శుభ్రం చేసే టూ ఇన్ వన్ వాహనాన్ని మండలంలోని అచ్చంపేట గ్రామంలో సోమవారం ప్రయోగాత్మకంగా ఉపయోగించినట్లు స్థానిక విస్తరణ శిక్షణా కేంద్రం అధికారి జె. రాంబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ యంత్రం పనితీరు, ఉపయోగాలు గురించి వివరించారు. డ్రైనేజీలలో పూడిక తీసి కావలసిన చోటకు వేగంగా రవాణా చేయడానికి, కాలువలు శుభ్రం చేయడానికి, కూలీలు ముందుకు రాని సందర్భాలలో ఈ యంత్రాన్ని ఉపయోగించి తక్కువ ఖర్చుతో పూడిక తీయవచ్చని తెలిపారు. పది మంది కార్మికులు చేసే పనిని ఈ యంత్ర సహాయముతో ఇద్దరితో పూర్తి చేయవచ్చని, ఒక అడుగు వెడల్పు గల మురికి కాలువలు నుంచి ఎక్కువ వెడల్పు, లోతు కలిగిన కాలువలలో కూడా పూడికను అతి సులభంగా ఈ యంత్ర సహాయంతో తీయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పొతల నాగమహేశ్వరి, ఎస్.కె. మొహిద్దిన్, గ్రామ పంచాయితీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.







