UPDATED 26th DECEMBER 2018 WEDNESDAY 5:00 PM
పెద్దాపురం: పెద్దాపురం నియోజకవర్గాన్ని ప్రణాళికాబద్దంగా నిరంతరం అభివృద్ధి చేస్తున్నామని, అన్ని సామాజిక వర్గాలకు కమ్యూనిటీ హాల్సును నిర్మిస్తున్నట్లు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. నగరదర్శిని-నగర వికాసం కార్యక్రమంలో భాగంగా పెద్దాపురం పట్టణంలో రూ.60 లక్షల వ్యయంతో నిర్మించనున్న మూడు సామాజిక భవనాలకు మంత్రి బుధవారం శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా స్థానిక 12వ వార్డు కొండయ్యపేటలో రూ.30 లక్షలతో క్రిస్టియన్ కమ్యూనిటీ హాలు, రూ.15 లక్షలతో శ్రీ మరిడమ్మతల్లి బిల్డింగ్ పెయింటర్స్ సామాజిక భవనం, రూ.15 లక్షలతో శ్రీ కనకదుర్గా తోపుడు బండ్ల సంక్షేమ సంఘ సామాజిక భవనానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మంత్రి చినరాజప్ప పాల్గొని మాట్లాడుతూ 2019 మార్చి నెలాఖరునాటికి పెద్దాపురం నియోజకవర్గాన్ని అన్ని మౌలిక వసతులతో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడం జరుగుతుందని అన్నారు. పట్టణాన్ని డబుల్ రోడ్సు, సెంట్రల్ లైటింగు, మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ, పార్కులతో సుందరంగా తీర్చిదిద్దడం జరిగిందని, 100 సంవత్సరాలు చరిత్ర కలిగిన ఆర్డీఓ, తహసీల్దార్, ఫైర్, ఎంపిడిఓ వంటి ప్రభుత్వ కార్యాలయాలకు నూతన భవనాలు నిర్మించడం జరిగిందని అన్నారు. ఎస్సీ, బిసి విద్యార్థులకు రెసిడెన్సియల్ పాఠశాలలు, అలాగే నియోజకవర్గంలో పేదలకు పక్కా గృహాలు నిర్మిస్తున్నామని అన్నారు. పట్టణానికి గోదావరి నుంచి మంచినీరు తీసుకువచ్చేందుకు రూ.20 కోట్లతో ప్రణాళిక రూపొందించడం జరిగిందని, ఇందులో ఫైపులైన్సు ఏర్పాటు నిమిత్తం రూ.10 కోట్లు విడుదల చేయడం జరిగిందని, దీనివల్ల రాబోయే 50 సంవత్సరాల వరకు త్రాగునీరు ముందుగా అందిస్తామని తెలిపారు. ప్రస్తుతం శంకుస్థాపన చేసిన మూడు సామాజిక భవనాలను మూడు నెలల్లో పూర్తి చేసేలా పనులను వేగవంతం చేయాలని మున్సిపల్ చైర్మన్ కు మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కొరిపూరి రాజు, ఆత్మా చైర్మన్ కలకపల్లి రాంబాబు, మున్సిపల్ కమీషనర్ బి.ఆర్. శేషాద్రి, టిడిపి పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు రంధి సత్యనారాయణ, తూతిక రాజు, వార్డు కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.







