UPDATED 11th AUGUST 2017 MONDAY 7:00 PM
గండేపల్లి: విద్యావ్యవస్థలో గ్రంథాలయాల పాత్ర ఎంతో కీలకమని జేఎన్టీయూకె వైస్ ఛాన్సలర్ వి.ఎస్.ఎస్. కుమార్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల క్యాంపస్ లో డెల్ నెట్ డిస్కవరీ సర్వీసెస్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్స్, నాలెడ్జ్ మేనేజ్మెంట్ టెక్నాలజీస్, ప్లాగరిజాం అనే అంశంపై నిర్వహించిన వర్క్ షాప్ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై సోమవారం మాట్లాడారు. విద్యావ్యవస్థలో గ్రంథాలయాల పాత్ర శక్తివంతమైనదే కాకుండా విద్యార్థులు తమ పరిజ్ఞానాన్ని మరింత పెంపొందించుకునేందుకు ఇవి దోహద పడతాయన్నారు. గ్రంథాలయాలకు ప్రత్యేకమైన నిధులు కేటాయించి వాటి అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం శుభ పరిణామమన్నారు. ఆయా విద్యాలయాలు విద్యార్థుల సౌకర్యార్ధం అవసరాలకు అనుగుణంగా రూ.50 వేల నుంచి రూ.25 లక్షల వరకు కేటాయింపు చేసి విద్యార్థులకు కావలసిన జర్నల్స్, బుక్స్, పేపర్స్, ఆన్ లైన్ జర్నల్స్ మొదలైన వాటిని అందుబాటులో ఉంచి విద్యార్థులకు అందించాలన్నారు. ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉపయోగపడే ఈ జర్నల్స్ జేఎన్టీయూకె అనుబంధ ఇంజనీరింగ్ కళాశాలలకు అన్నింటికీ అందిస్తున్నామన్నారు. అనంతరం కళాశాల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి మాట్లాడుతూ జాతీయస్థాయి డెల్ నెట్ వర్క్ షాప్ కు ఆదిత్య వేడుక కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తమ కళాశాల విద్యార్థులకు ఎంతో విలువైన పుస్తకాలను కళాశాల గ్రంథాలయ విభాగంలో పొందుపరిచామన్నారు. డెల్ నెట్ ప్రతినిధులు మాట్లాడుతూ దేశంలో ఆరు వేలకు పైగా గ్రంథాలయాలు డెల్ నెట్ ద్వారా అనుసంధానమై ఎన్నో మిలియన్ల సంఖ్యలో సమాచారాన్ని నిక్షిప్తపరుస్తున్నామని పేర్కొన్నారు . ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, డాక్టర్ కె. రవి శంకర్, గ్రంథాలయాధికారి అశోక్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.







