UPDATED 26th JANUARY 2019 SATURDAY 5:00 PM
గండేపల్లి: అవినీతి రహిత సమాజం కోసం ప్రతీ ఒక్కరూ పాటుపడాలని ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి అన్నారు. గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యా సంస్థల ప్రాంగణంలో 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల విద్యార్థులు, క్యాంపస్ సెక్యూరిటీ సిబ్బంది మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ శేషారెడ్డి మాట్లాడుతూ నైసర్గికంగా ఎన్నో వనరులు, మేధాసంపత్తి గల యువత ఉన్నప్పటికీ మనదేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే పిలవబడుతుందని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం గల మన దేశంలో బలమైన చట్టం, నిర్దిష్టమైన న్యాయ వ్యవస్థ, పార్లమెంటరీ వ్యవస్థ, జర్నలిజం వంటి నాలుగు వ్యవస్థలతో పనిచేస్తున్నప్పటికీ అవినీతి, లంచగొండితనం, ఆశ్రిత పక్షపాతంతో ప్రజలచే ఎన్నుకోబడిన నాయకులు ఆ ప్రజల అభివృద్ధి కోసం కాకుండా వారి అభివృధ్ధి కోసం మరలా ఎంపికై అక్రమ సంపాదనతో దోచుకుంటున్నంత కాలం అభివృద్ధి సాధ్యం కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, డాక్టర్ ఆదిరెడ్డి రమేష్, డాక్టర్ శరభోజి, డాక్టర్ వల్లెం శ్రీనివాసరావు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.







