* పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప
UPDATED 3rd DECEMBER 2019 TUESDAY 8:00 PM
సామర్లకోట(రెడ్ బీ న్యూస్): ఆత్మవిశ్వాసం, అసాధారణ ప్రతిభ ఆయుధాలుగా చేసుకుని దివ్యాంగులు ముందుకు సాగాలని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. స్థానిక భవిత కేంద్రంలో మండల విద్యాశాఖాధికారిణి ఎస్. విజయలక్ష్మీదేవి అధ్యక్షతన మంగళవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే చినరాజప్ప ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడుతూ దివ్యాంగులు పట్ల ప్రతీ ఒక్కరూ సేవా దృక్పథం కలిగి ఉండాలని అన్నారు. పుట్టుకతో లూయిస్ బ్రెయిలీ అంధుడైనప్పటికీ కోట్లాదిమంది అంధులకు చదవడం, రాయడం కోసం బ్రెయిలీ లిపి కనుగొన్నారన్నారు. మానసిక దృఢత్వం ముందు శారీరక వైకల్యం ఓడిపోతుందన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భవిత కేంద్రంలో అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని, వీటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. భవిత కేంద్రాలకు అవసరమైన సదుపాయాలు కల్పనకు కృషి చేస్తానని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే చినరాజప్ప, సర్వశిక్షా అభియాన్ జిల్లా కోఆర్డినేటర్ విజయభాస్కర్ కేక్ కట్ చేసి దివ్యాంగులకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు గుమ్మళ్ల రామకృష్ణ, యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్, అందుగుల జార్జి చక్రవర్తి, భవిత కేంద్రం ఉపాధ్యాయులు అనిత, పద్మ, ఫిజియోథెరపిస్ట్ రాజు, పి. రాజేష్, తాతపూడి కృష్ణ బాబు, తోటకూర శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.







