UPDATED 5th JANAUARY 2019 SATURDAY 8:00 PM
సామర్లకోట: సామర్లకోట మండలం పెదబ్రహ్మదేవం గ్రామంలో గల శ్రీ శారద రామకృష్ణ సేవాసమితి సభ్యులు పదవతరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమం శనివారం నిర్వహించారు. గత 12 సంవత్సరాలుగా సమితి గౌరవాధ్యక్షులు వింజమూరి సుబ్రహ్మణ్యశర్మ సౌజన్యంతో విశ్వనాధ విద్యా ప్రకాశిని పేరిట ఈ స్టడీ మెటీరియల్ పంపిణీ చేస్తున్నట్లు సమితి సభ్యులు తోటకూర సాయిరామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా సమితి గౌరవాధ్యక్షులు వింజమూరి సుబ్రహ్మణ్యశర్మ మాట్లాడుతూ పెదబ్రహ్మదేవం గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచి అత్యుతమ ఫలితాలు సాధించి, తద్వారా గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని, చదువుతోనే సర్వతోముఖాభివృద్ధి సాధ్యపడుతుందని నమ్మి గత 12 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. వేసవి శిక్షణా తరగతుల నిర్వహణ, పదవతరగతిలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలతో సత్కరించుట, శ్రీ శారదా బాలానందం ద్వారా విద్యార్థులకు శిక్షణా తరగతుల నిర్వహణ, తదితర కార్యక్రమాల ద్వారా విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు. రాజమండ్రి శ్రీ రామకృష్ణ మఠం అధ్యక్షులు నిశ్చిలానంద మహారాజ్ మాట్లాడుతూ ఎంతో ఉన్నత ఆశయంతో వ్యయ ప్రయాసలకోర్చి గ్రామంలో గల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలనే సదుద్దేశ్యంతో సమితి చేసే ఈ అక్షర యజ్ఞంతో మంచి ఫలితాలు సాధించి ఉన్నతస్థాయికి చేరుకోవాలని, కష్టపడి కాదు ఇష్టపడి చదవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వేదపండితులు ఇంద్రగంటి సత్యనారాయణశర్మ, ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వరరావు, కంటిపూడి గోపాలకృష్ణ, సమితి అధ్యక్షుడు గంగాధర్, కార్యదర్శి వింజమూరి విశ్వనాధ్, నువ్వుల వెంకట్రాజు, నువ్వుల బాబ్జి, సూర్యచంద్రరావు, కమ్మిల వెంకటేశ్వరరావు, ఇంద్రగంటి గోపాలకృష్ణ, మల్లిపూడి గంగాధరరావు, తదితరులు పాల్గొన్నారు.







