UPDATED 20th SEPTEMBER 2019 FRIDAY 9:00 PM
సామర్లకోట(రెడ్ బీ న్యూస్): ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా నాణ్యమైన ధాన్యాన్ని సేకరించి దేశం మన జిల్లా వైపు చూసేలా కొనుగోలు కేంద్రాల సిబ్బంది విధులు నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. స్థానిక టిటిడిసిలో పెద్దాపురం డివిజన్ పరిధిలో ఏర్పాటు చేయనున్న 34 ధాన్యం కొనుగోలు కేంద్రాల సిబ్బందికి శిక్షణా కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 2019 -20 సంవత్సరానికి సంబంధించి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు నిర్వహణ నియమావళి సూచించిందని, ఈ నియమావళిని అనుసరించి శిక్షణను అవగాహన చేసుకుని పిపిసి కేంద్రాల్లో నిర్వహణ చేపట్టాలని అన్నారు. రేషన్ ద్వారా పేదలకు అందజేస్తున్న బియ్యం నాణ్యత కలిగి ఉండాలని, ఇటీవల మన జిల్లా నుంచి బియ్యం శ్రీకాకుళం జిల్లాకు పంపడం జరిగిందని అన్నారు. సిబ్బంది పనిలో నిబద్ధత కలిగి ఉండాలని, విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రత్యేకంగా 2019-20 ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో టెక్నీషియన్ ఇస్తున్నామని, తేమశాతం నిర్ణయించడంలో పూర్తి అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. ఈ కొనుగోలు కేంద్రాలలో అందరికీ తెలిసే విధంగా ప్లెక్సీలను ఏర్పాటు చేయాలని, కల్లాల నుంచి ధాన్యాన్ని నేరుగా రైస్ మిల్లులకు రవాణా చేయడానికి ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ప్రభుత్వం సాధారణ వరి రకానికి క్వింటాలుకు రూ.1815, గ్రేడ్ ఏ రకానికి క్వింటాలుకు రూ.1835 కనీస మద్దతు ధర ప్రకటించిందని ఆయన తెలిపారు. పెద్దాపురం ఆర్డీవో ఎస్. మల్లిబాబు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ పారదర్శకంగా జరగాలని, ఎలాంటి పొరపాట్లు లేకుండా సిబ్బంది పని చేయాలని అన్నారు. ముఖ్యంగా తేమశాతం నిర్ణయించే యంత్రంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల గురించి విస్తృత ప్రచారం చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమానికి ముందు సాంకేతిక నిపుణులు యు.కె.మిశ్రా, డిఎన్డి ప్రభాకరావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కేంద్రాల నిర్వహణ పై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిఎస్ఓ పి. ప్రసాదరావు డీఎమ్ ఈఎస్ జయరాములు, ఏఎస్ఓ కెవిఎస్ఎస్ ప్రసాద్, టి సి.ఎస్.కె.వి.ఆర్.వి శర్మ, డిఆర్డీఏ సూపరింటెండెంట్ వరలక్ష్మి, డివిజన్ పరిధిలోని ఎంఎస్ఓలు, పిపిసి కేంద్రాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.







