వాడవాడలా మేడే వేడుకలు

* కదం తొక్కిన కార్మిక లోకం
* జెండా ఆవిష్కరణ సభల్లో నాయకులు

UPDATED 1st MAY 2019 WEDNESDAY 9:00 PM

సామర్లకోట: ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా సిఐటియు, పలు సంఘాల ఆధ్వర్యంలో మేడే వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. సామర్లకోట మండలంలో సుమారు 11 చోట్ల పతాకాలు ఎగురవేశారు. అనంతరం సామర్లకోట భగత్ సింగ్ విజ్ఞానకేంద్రం, సిఐటియు కార్యాలయం నుంచి కార్మికులు పెద్ద సంఖ్యలో ర్యాలీగా బయలుదేరారు. ఈ ర్యాలీలో అంబేద్కర్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, చేగువేరా భారతమాతతో పాటు వివిధ వేషధారణలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ ర్యాలీ స్థానిక మెహర్ కాంప్లెక్స్ మీదుగా ప్రారంభమై మఠం సెంటర్, స్టేషన్ సెంటర్, గోలివారి వీధి, బళ్ళ మార్కెట్ సెంటర్ వరకు సాగింది. అనంతరం స్థానిక బళ్ళ మార్కెట్ సెంటర్ వద్ద బహిరంగ సభలో బాలం శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించగా రాష్ట్ర సిఐటియు కోశాధికారి ఏవీ నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ శ్రమజీవుల కష్టానికి గుర్తుగా మేడే ఉద్భవించిందని అన్నారు. ఎనిమిది గంటల పని కోసం ఆనాడు చికాగోలో కార్మికులు పోరాడితే పోలీసుల కాల్పులు చేసి, ఎనిమిది మంది కార్మికుల ప్రాణాలు బలిగొన్నారని గుర్తు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తోన్న కార్మిక వ్యతిరేక విధానాలపై నిరంతర పోరాటం చేస్తామని, దేశంలో సంపద సృష్టించే కార్మికవర్గానికి దానిపై హక్కు లేకుండా పోతోందన్నారు. ప్రభుత్వాలు కార్పొరేట్‌ కంపెనీలకు, పెద్దపెద్ద పెట్టుబడిదారులకు, యాజమాన్యాలకు కొమ్ముకాస్తూ కార్మిక హక్కులను కాలరాస్తున్నారని అన్నారు. కార్మిక హక్కులు, ఉపాధి రక్షణ, ప్రభుత్వ రంగ పరిరక్షణ, కనీస వేతనాలు సాధన, అందరికీ పీఎఫ్‌, ఈఎస్‌ఐ, పించనుతో కూడిన చట్టం కోసం పెద్దఎత్తున పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాళం సత్యనారాయణ, టి. నాగమణి, బాలం శ్రీనివాస్, కరణం ప్రసాదరావు, కరక మాణిక్యం, చెప్పుల నూకరాజు, తుంపాల శ్రీనివాస్, అప్పలరాజు, రాణి, శ్రీలక్ష్మి, బాలం హరిబాబు, చల్లపల్లి వెంకట మాధవరావు, పెద్దిరెడ్డి సత్యనారాయణ, ఎలిశెట్టి రామదాసు, చానా పశువుల రావు, వజ్రపు రవి, యండమూరి వెంకట్రావు, రవీంద్ర, పీత సాయిబాబా, మడగల రమణ, అల్లూరు భద్రం, పెద్దిరెడ్డి అర్జునరావు, పోతుల బాపిరాజు, సూరిబాబు,తదితరులు పాల్గొన్నారు. 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us