* ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్
UPDATED 7th FEBRUARY 2020 FRIDAY 8:00 PM
సామర్లకోట(రెడ్ బీ న్యూస్): రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సేవలను వినియోగించుకుంటూ ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సీనియర్ ఐపీఎస్ అధికారి, ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ అధికారులను ఆదేశించారు. సామర్లకోట బస్ కాంప్లెక్స్ ను శుక్రవారం సాయంత్రం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. బస్ కాంప్లెక్స్ లోకి బస్సులు రాకపోకలు జరిగే ప్రదేశాలలో ఆక్రమణలు పెరిగిపోవడంతో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఎండి దృష్టికి తీసుకువచ్చారు. ఆర్టీసీ ఆవరణ పరిధిలో ఉన్న ఆక్రమణలను ఎలాంటి రాజకీయ ఒత్తిడులకు తలొగ్గకుండా వెంటనే తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రతీరోజు ఉదయం, సాయంత్రం బస్సులలో వేలాడుతూ ప్రయాణం చేయవలసి వస్తుందని, కళాశాల సమయాల్లో ప్రత్యేక బస్సులను నడపాలని స్థానికులు ఎండి దృష్టికి తీసుకురాగా లోకల్ బస్సులను నడిపే ప్రయత్నం చేయాలని ఆర్ఎం నాగేశ్వరరావును ఆదేశించారు. ప్రయాణికులు చేయి ఎత్తిన వెంటనే బస్సు ఆపాలని, విద్యార్థులకు ఇస్తున్న బస్సు పాస్ లు సద్వినియోగం అయ్యేలా ఆయా రూట్లలో బస్సులను నడపాలని అన్నారు. కాంప్లెక్స్ పరిధిలోని ఉన్న మరుగుదొడ్లను ఆయన పరిశీలించిన అనంతరం విద్యార్థులు, ప్రయాణికులను బస్సుల పరిస్థితులపై ఆరా తీశారు. అలాగే ప్రయాణీకుల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు సామర్లకోట నుంచి ద్వారపూడి మీదుగా రాజమహేంద్రవరం వెళ్లే బస్సులో ఆయన ప్రయాణం చేశారు. ఈ కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ ఆర్.వి.ఎస్. నాగేశ్వరరావు, సిటిఎం ప్రసాద్, కాకినాడ డిపో మేనేజర్ భాస్కరరావు, కాకినాడ స్టేషన్ మేనేజర్ సత్యవతి, పెద్దాపురం సీఐ విజయకుమార్, సామర్లకోట ఎస్సైలు సుమంత్, బాలాజీ, ఆర్టీసీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.







