UPDATED 29th MARCH 2018 THURSDAY 10:00 PM
సామర్లకోట: పేద ప్రజల గుండె చప్పుడు తెలుగుదేశం పార్టీ అని రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం స్థానిక మఠం సెంటర్ లో హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ పార్లమెంట్ సభ్యులు తోట నరసింహం నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ తెలుగుజాతి ప్రజల సంక్షేమం కోసం పార్టీని స్థాపించిన మహోన్నత వ్యక్తి ఎన్‌టీఆర్ అని, కార్యకర్త అనే బలమైన పునాదిపై పార్టీ ఏర్పాటు అయిందని, రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తోందన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా లక్ష్యంగా స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. రాష్ట్రం విడిపోయినా ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అధికారాలు, హక్కులను కాలరాసే కుట్రలు, కుతంత్రాలు పన్నుతోందని, ఇలాంటి క్లిష్ట సమయంలో వాటిని సమర్థంగా ఎదుర్కోవాలన్నారు. స్టేషన్ సెంటర్ లో గడియార స్తంభం ఏర్పాటు చేయుటకు సన్నాహాలు చేస్తున్నామని, సామర్లకోటలో చాలా వరకు అభివృద్ధి జరిగిందని అంగన్వాడి బిల్డింగ్స్, రోడ్లు, డ్రైన్లు, వివిధ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని తెలిపారు. ఎంపీ నరసింహం మాట్లాడుతూ ఎన్టీఆర్ తొమ్మిది నెలల్లోనే పార్టీ స్థాపించి అధికారంలోకి రావడం అనేది ఒక గిన్నీస్ బుక్ రికార్డు అని, ఆంధ్రుల యొక్క ఆత్మ గౌరవాన్ని దేశమంతా వ్యాపింపచేశేలా చేసిన ఘనత ఆయనది అన్నారు. టిడిపి జిందాబాద్, ఎన్టీఆర్ అమర్‌హై, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వం వర్థిల్లాలి అంటూ నినాదాలు హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, మున్సిపల్ వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అడబాల చిట్టిబాబు, పాలకుర్తి శ్రీనుబాబు, ముత్యాలరాజబ్బాయి తదితరులు పాల్గొన్నారు.







