UPDATED 11th SEPTEMBER 2019 WEDNESDAY 9:00 PM
సామర్లకోట (రెడ్ బీ న్యూస్) : సామర్లకోట పట్టణాన్ని స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్ధేందుకు ప్రజలంతా సహకరించాలని మున్సిపల్ కమీషనర్ ఎం. ఏసుబాబు అన్నారు. దేశ ప్రధాని నరేంద్రమోడీ ప్రవేశపెట్టిన స్వచ్ఛతే హీ సేవ కార్యక్రమంలో భాగంగా బుధవారం నిర్వహించిన ర్యాలీని మున్సిపల్ కమీషనర్ జెండా ఊపి ప్రారంభించారు. ప్లాస్టిక్‌ను నిషేధించాలని, గుడ్డ బ్యాగులను వినియోగించాలని, భూగర్భ జలాలు పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమీషనర్ ఏసుబాబు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు 2020 అక్టోబర్ 2 నాటికి సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధాన్ని చేపట్టాలని, పర్యావరణ కాలుష్యాన్ని నివారించేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలన్నారు. వర్షపు నీటిని వృధాకానివ్వకుండా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయడం, ఖాళీ స్థలాల్లో మొక్కలు పెంచడం చేపట్టాలన్నారు. ఈ మేరకు పట్టణ ప్రజలు, ప్రజా ప్రతినిధులు ప్రతీ ఒక్కరూ ప్లాస్టిక్ నిషేధానికి సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఎఇ, మెప్మా సిబ్బంది, గ్రామ వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.







