UPDATED 6th JUNE 2019 THURSDAY 9:00 PM
పెద్దాపురం: విత్తన శుద్ధి చేపట్టడం ద్వారా రైతులు అధిక దిగుబడులు సాధించవచ్చని ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎన్. నాగేంద్రబాబు అన్నారు. ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం ఏరువాక కేంద్రం (పెద్దాపురం), రిలయన్స్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో రైతులకు విత్తన శుద్ధి, విత్తనోత్పత్తిపై రైతులకు గురువారం అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త నాగేంద్రబాబు మాట్లాడుతూ రైతులు వరి పంటలకు సిఫార్సు చేసిన భావిష్టన్ (కార్బోడిజం), సుడోమొనాస్ మందులతో విత్తన శుద్ధి చేసుకుని వరి పంటను తెగుళ్ల బారి నుంచి కాపాడుకోవాలని తెలిపారు. పొడి విత్తన శుద్ధి కోసం ఒక కేజీ విత్తనాలకు మూడు గ్రాముల భావిష్టన్ పౌడర్ వాడుకోవాలని, అలాగే తడి విత్తన శుద్ధి కోసం ఒక కేజీ విత్తనాలకు లీటర్ నీటికి ఒక గ్రాము భావిష్టన్ (కార్బోడిజం) ఉపయోగించాలని అన్నారు. తడి విత్తన శుద్ధిలో భాగంగా మందు కలిపిన నీటిలో 24 గంటలు నానబెట్టి మరో 24 గంటలు మండి కట్టి మొలకలు వచ్చిన విత్తనాలను మరుసటి రోజు పొలంలో చల్లుకోవాలని సూచించారు. ఇలా చేయడం ద్వారా వేరు కుళ్ళు, మాగుడు, అగ్గితెగుళ్లను తగ్గించుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిలయన్స్ ఫౌండేషన్ ప్రాజెక్టు మేనేజర్ బర్రే నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతులు తమ సమస్యలు, సలహాలు, వాతావరణ సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1800 419 8800 కు ఫోన్ చేసి సమాచారం పొందవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిలయన్స్ సిబ్బంది అనుకుల నాగరాజు, యు. రమేష్ బాబు, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.







