* ఐటీడీఏ ఇంఛార్జ్ పీవో ప్రవీణ్ ఆదిత్య
UPDATED 3rd JULY 2020 FRIDAY 6:00 PM
రంపచోడవరం(రెడ్ బీ న్యూస్): గిరిజన ప్రాంతాలలో అందుబాటులో ఉన్న వైద్య పరికరాల సహాయంతో మెరుగైన వైద్య సేవలు అందించి గిరిజనుల ఆరోగ్య పరిరక్షణలో పూర్తిగా తోడ్పాటు అందించాలని సబ్-కలెక్టర్, ఐటీడీఏ ఇంఛార్జ్ పీవో ప్రవీణ్ ఆదిత్య వైద్య సిబ్బందిని ఆదేశించారు. మండల పరిధిలోని వాడపల్లి, బోలగొండ, బందపల్లి గ్రామాలలో ఆయన శుక్రవారం పర్యటించారు. ముందుగా వాడపల్లి డిఆర్‌డిపోను సందర్శించి నిత్యావసర వస్తువులు నిల్వలను తనిఖీ చేశారు. ఉండాల్సిన నిల్వలు కంటే నిల్వలు తక్కువగా ఉండడాన్ని ఆయన గుర్తించారు. నిత్యావసరాలు అవసరాల మేరకు అందుబాటులో ఉంచుకుని కార్డుదారులందరికి ఆహార భద్రత కల్పించాలని ఆదేశించారు. కరోనా కారణంగా ప్రభుత్వం ఇటీవల ఉచితంగా రేషన్ పంపిణీ చేస్తోందని, అవి కూడా సక్రమంగా అందించి గిరిజనులకు సహకరించాలని తెలిపారు. అనంతరం వాడపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఆసుపత్రిలో పరిశు భ్రత లోపించిందని, వాష్ రూమ్, ప్రసవ గది వద్ద అపరిశుభ్రంగా ఉండడాన్ని ఆయన గమనించి పరిశుభ్రతపై మరింతగా దృష్టి సారించాలని ఆసుపత్రి సిబ్బందిని ఆదేశించారు. వైద్యాధికారులు తమ ఆసుపత్రిలో గణాంకాలు పట్ల అవగాహన కల్గి ఉండాలని ఆయన సూచించారు. అలాగే బోలగొండ, బందపల్లి ఆరోగ్య ఉప కేంద్రాలను సందర్శించి వైద్య సేవలు అందిస్తున్న తీరును ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.







