మీడియా స్వేచ్ఛకు సంకెళ్ళా...

* ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారాల నిలుపుదలపై నిరసనల వెల్లువ
* వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్‌
* ఆర్డీవోకు వినతిపత్రం అందచేత

UPDATED 16th SEPTEMBER 2019 MONDAY 6:00 PM

పెద్దాపురం(రెడ్ బీ న్యూస్) : ప్రజల పక్షాన నిలిచి ఎప్పటికప్పుడు నిజాలను నిర్భయంగా బయటపెడుతున్న ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ ఛానల్ ప్రసారాలను నిలిపేయడం దారుణమని పెద్దాపురం పాత్రికేయులు నిరసన వ్యక్తం చేశారు. ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి ఛానల్ ప్రసారాలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ ఎన్.పి.ఎస్.వినాయక్ ఆధ్వర్యంలో పాత్రికేయులు సోమవారం ఆర్డీవో ఎస్. మల్లిబాబుకు వినతిపత్రం అందచేశారు. అనంతరం పలువురు సీనియర్ పాత్రికేయులు మాట్లాడుతూ నిజాన్ని నిర్భయంగా చెప్పే మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేయడం అప్రజాస్వామికమని, పత్రికా స్వేచ్చ మీడియా గురించి పదేపదే మాట్లాడినవారు అధికారంలోకి రాగానే ఛానళ్లపై ఉక్కుపాదం మోపడం ఏమిటని ప్రశ్నించారు. నిజాలను నిర్ణయంగా ప్రసారం చేయడాన్ని జీర్ణించుకోలేక కేబుల్ ఆపరేటర్లపై ఒత్తిడి తీసుకువచ్చి ఏబీఎన్ ప్రసారాలను నిలుపుదల చేయడం దారుణమన్నారు. ప్రజల గొంతుకను వినిపిస్తున్న ఏబీఎన్‌ ఛానల్‌ను నిషేధించడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని, జర్నలిజం ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తుందని అన్నారు. పరిపాలనలో ప్రభుత్వం చేసే తప్పులను ప్రజల దృష్టికి తేవడం జర్నలిజం బాధ్యత అని, ప్రజల అభివృద్ధికి, సంక్షేమానికి కృషి చేసే బాధ్యత జర్నలిజంపై ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను అడ్డుకోవడం తగదన్నారు. ప్రభుత్వ పాలనలో లోటుపాట్లు తెలియజేస్తున్న మీడియాపై ఆంక్షలు తగవని, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరాలంటే మీడియానే కీలకమని అన్నారు. తక్షణమే ఏబీఎన్ ప్రసారాలను పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు మొల్లి సూర్యనారాయణ, బూరాడ శ్రీనివాసరావు, బద్ది కుమార్, చవ్వాకుల ఈశ్వరరావు, గోపు సత్తిబాబు, తదితరులు పాల్గొన్నారు.

 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us