UPDATED 22nd SEPTEMBER 2018 SATURDAY 9:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల క్యాంపస్ లో గల ఆదిత్య గ్రూప్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలలకు ఏఐసిటిఇ, న్యూఢిల్లీ నుంచి ప్రతిష్ఠాత్మకమైన చాత్రా విశ్వకర్మ అవార్డులు లభించినట్లు ఆదిత్య విద్యాసంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్బంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ విద్యాసంబంధమైన విజయాలు సాధించే ప్రక్రియలో ఆదిత్య తన ప్రత్యేకతను ఎప్పుడూ చాటుకుంటుందని అన్నారు. ఏస్థాయి పోటీలైనా తనదైన ప్రత్యేక ముద్రను కలిగి ఉండడం ఆదిత్యకు ఆదినుంచి ఆనవాయితీగా వస్తుందని, అందుకు ఆదిత్య నిరంతర శ్రమ, విద్యాప్రమాణాలు పాటించడంలో పడే తపన కు తార్కాణాలని, ఇటువంటి అవార్డులు మరింత ఉత్సాహంగా పనిచేయడానికి ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తాయని అన్నారు. ఆదిత్య విద్యాసంస్థల అధినేత నల్లమిల్లి శేషారెడ్డి మాట్లాడుతూ తూర్పు గోదావరి జిల్లాలోని 34 ఇంజనీరింగ్ కళాశాలలకు 13 అవార్డులు ప్రకటించగా అందులో ఆదిత్య సంస్థకు చెందిన ఇంజనీరింగ్ కాలేజీలకు చెందిన ఆరు బృందాలు ఈ చాత్రా విశ్వకర్మ అవార్డులను గెలుచుకున్నాయని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా అవార్డు గెలుచుకున్న విద్యార్థులను, సహకరించిన అధ్యాపక బృందాన్ని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య గ్రూప్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలల ప్రిన్సిపాల్స్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, డాక్టర్ ఆదిరెడ్డి రమేష్, వైస్ ప్రిన్సిపాల్స్, వివిధ విభాగాధిపతులు, తదితరులు పాల్గొన్నారు.







