UPDATED 12th JULY 2018 THURSDAY 9:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ ప్రాంగణంలో గల ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్లో ఇండియన్ బ్యాంకింగ్ వ్యవస్థపై ప్యానల్ చర్చను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ చర్చలో భాగంగా భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థలో లోపాలు, వాటిని అధిగమించేందుకు అవసరమైన సాంకేతిక వ్యవస్థలు గురించి చర్చించారు. అమెరికా ఆర్ధిక వ్యవస్థతో పోటీపడే విధంగా భారతీయ ఆర్థిక వ్యవస్థను నగదు రహిత ఆర్ధికశక్తిగా రూపొందించడానికి అనేక సవాళ్లు అధిగమించాల్సి ఉందని తెలిపారు. భారత ఆర్ధిక వ్యవస్థలో మొత్తం జనాభాలో పన్ను చెల్లింపుదారులు కేవలం 1.5 శాతం మాత్రమే ఉన్నారని, ఇది అమెరికా ఆర్ధిక వ్యవస్థలో పన్ను చెల్లింపుదారుల సంఖ్యతో పోల్చలేమని డాక్టర్ మెహర్జీ దువ్వూరి అన్నారు. నూతన సర్వీసులు, సాంకేతిక మార్పులు గురించి టి. దుర్గాప్రసాదరావు విద్యార్థులకు వివరించారు. బిబిఏ విద్యార్థులు గ్రూపులుగా ఏర్పడి ప్యానల్ చర్చలో పాల్గొన్నారు. ఈ చర్చలో న్యాయనిర్ణేతలుగా అధ్యాపక సిబ్బంది డాక్టర్ మెహర్జీ దువ్వూరి, డాక్టర్ టి. దుర్గా ప్రసాదరావులు వ్యవహరించి ఉత్తమ విశ్లేషణ గావించిన ప్యానల్ ను విజేతలుగా ఎంపిక చేశారు. బ్యాంకింగ్ రంగంలో సాంకేతిక పాత్ర అనే అంశానికి మొదటి బహుమతి సూర్య తేజ, ద్వితీయ బహుమతి రాగప్రియ, తృతీయ బహుమతి సాయికుమార్ గెలుపొందారు. బ్యాంకింగ్ వ్యవస్థ పునర్నిర్మాణం అనే అంశంలో విజేతలుగా ఎమ్. భరద్వాజ్, అభిజిత్ సర్కార్, హెచ్. సాయిసత్య, బహుమతులు గెలుపొందారు. శ్రోతలకు నిర్వహించిన క్విజ్ పోటీలలో రేష్మ, సాయి సంజన, లీలాధర్ బహుమతులను కైవసం చేసుకొన్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి. ఆస్థాశర్మ మాట్లాడుతూ విద్యార్థులు ఇటువంటి చర్చలలో పాల్గోవడం వల్ల సరైన అవగాహన, విషయ పరిజ్ఞానం లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎన్. విశాలాక్షి, అధ్యాపక సిబ్బంది, ద్వితీయ, తృతీయ సంవత్సరం బిబిఏ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.







