UPDATED 17th JULY 2019 WEDNESDAY 9:00 PM
సామర్లకోట: శాంతిభద్రతలు పరిరక్షణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ప్రజలంతా సహకరించాలని సామర్లకోట ఎస్ఐ వేండ్ర లక్ష్మీవెంకటకృష్ణ సుమంత్ అన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్ లో బుధవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, గుట్కా, పేకాట, క్రికెట్ బెట్టింగులపై ఉక్కుపాదం మోపుతామని అన్నారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూస్తామని, ప్రతీ షాపు యజమాని తమ తమ షాపుల ముందు వాహనాలు పార్క్ చేయకుండా చూడాలని పేర్కొన్నారు. రహదారి భద్రతపై దృష్టి పెట్టి రోడ్డు ప్రమాదాలు నివారించడానికి కృషి చేస్తానని, అంకితభావం, నిష్పక్షపాతం ముఖ్యమని, అప్పుడే పోలీసు వ్యవస్థ పట్ల విశ్వాసం పెరుగుతుందని అన్నారు. బెల్టు దుకాణాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. ఈ సమావేశంలో ట్రాఫిక్ ఎస్ఐ టి. చక్రపాణి, తదితరులు పాల్గొన్నారు.



