* కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు
* ప్రగతిలో ఘనంగా సర్జికల్ స్ట్రైక్స్ డే
UPDATED 29th SEPTEMBER 2018 SATURDAY 9:00 PM
గండేపల్లి: దృఢ సంకల్పంతో చేసే పని ఏదైనా విజయం సిద్ధిస్తుందని, భారతదేశంలోని 126 కోట్ల మంది ప్రజల భద్రత సైనికుల చేతుల్లో ఉందని, దేశానికి నిజమైన సేవకులు సైనికులే అని ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు అన్నారు. గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలలో సర్జికల్ స్ట్రైక్స్ డే ద్వితీయ వార్షికోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎన్.సి.సి గ్రూప్ (కాకినాడ) లెఫ్టినెంట్ కమాండర్ కల్నల్ ఎల్.సి.ఎస్. నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ డాక్టర్ కృష్ణారావు మాట్లాడుతూ 2016 సెప్టెంబర్ 29న భారతీయ ఆర్మీదళం కమాండోలు సర్జికల్ స్ట్రైక్ నిర్వహించి 35 మంది పాక్ మిలిటెంట్లను అంతమొందించారని అన్నారు. దానికి ప్రతీకగా అప్పట్నుంచి సర్జికల్ స్ట్రైక్స్ డే నిర్వహిస్తున్నామన్నారు. ప్రణాళిక, చిత్తశుద్ధి, క్రమశిక్షణలు క్యాడెట్లకు ఉండాలన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొని మనల్ని కాపాడే వారు సైనికులన్నారు. లాల్ బహదూర్ శాస్త్రి జైజవాన్, జైకిసాన్ అని ఆనాడు కితాబునిచ్చారని తెలిపారు.1962లో చైనాతో జరిగిన యుద్ధంలోనూ,1971లో పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలోనూ మన సైనికులు అపారమైన శక్తియుక్తులను ప్రయోగించి దేశాన్ని కాపాడారన్నారు. దేశానికి నిజమైన సేవకులు సైనికులు అన్నారు. దేశ సరిహద్దుల్లో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశాన్ని కాపాడుతున్నారని వారి సేవలను కొనియాడారు. ముఖ్య అతిధి కల్నల్ ఎల్.సి.ఎస్. నాయుడు మాట్లాడుతూ మిలటరీ అంటే క్రమశిక్షణకు మారుపేరన్నారు. ఎక్కడికి వెళ్లినా అక్కడి పరిస్థితులకు అనుకూలంగా మారిపోయి దేశాన్ని కంటికి రెప్పలా కాపాడడమే సైన్యం పని అన్నారు. సర్జికల్ స్ట్రైక్ అంటే తమని తాము రక్షించుకుంటూ వనరులు నష్టపోకుండా దాడి చేయడం అని అన్నారు. త్రివిధ దళాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సులలో యువకులకు ముఖ్యంగా టెక్నికల్ విద్యార్థులకు ఉన్న ఉద్యోగ అవకాశాలు, అందుకు కావలసిన అర్హతలు, మార్గదర్శకాలను ఆయన తెలియచేశారు. మిలటరీలో చేరి దేశసేవ చేయడం అనేది ప్రతీ ఒక్క పౌరుని భాద్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శంభూప్రసాద్, కళాశాల డైరక్టర్స్, వైస్ ప్రెసిడెంట్, వైస్ ప్రిన్సిపాల్, డీన్ అడ్మినిస్ట్రేషన్ వివిధ విభాగాధిపతులు, సీనియర్ అధ్యాపకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.







