UPDATED 4th OCTOBER 2017 WEDNESDAY 8:00 PM
గండేపల్లి : తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలలో ఈ నెల 6,7,8 తేదీల్లో కళాశాల కెమిస్ట్రీ, ఆర్&డి విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో జాతీయస్థాయి సదస్సు నిర్వహించనున్నట్లు కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు తెలిపారు. పర్యావరణం, ఫార్మసీ, సాంకేతిక రంగాల్లో కెమిస్ట్రీ పరంగా చోటుచేసుకుంటున్న నూతన పోకడలు, కెమిస్ట్రీ అధ్యాపకుల జాతీయస్థాయి సమావేశం ఈ సదస్సులో ప్రధాన అంశాలని ఆయన పేర్కొన్నారు. విద్య, పరిశోధనా రంగాల్లో నిష్ణాతులైన శాస్త్రవేత్తేలతో సమావేశం నిర్వహించి వారి సూచనలు సలహాలు తీసుకుంటూ వారి అనుభవాలను గ్రహించే అవకాశం అధ్యాపక సిబ్బందికి, ఔత్సాహిక పరిశోధకులకు, విద్యార్థులకు తాము నిర్వహిస్తున్న ఈ సదస్సు ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శంభూ ప్రసాద్ మాట్లాడుతూ తమ కళాశాల ఆర్&డి విభాగం ఇతర శాస్త్ర, సాంకేతిక విభాగాలతో కలిసి అనేక అంతర్గత విభాగ పరిశోధనా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ సదస్సు ద్వారా విద్యావేత్తలు, పరిశోధకులు, అధ్యాపకులు, విద్యార్థులు తమ పురోగతికి అవసరమైన పరిజ్ఞానాన్ని పెంపొందించుకోగలుగుతారన్నారు. ప్రొఫెసర్ పి.వి.ఎస్.మాచిరాజు మాట్లాడుతూ వాతావరణ మార్పులు ఇంధన టెక్నాలజ, హరిత టెక్నాలజీ, పారిశ్రామిక రంగం, హైడ్రొలోజి, నానో టెక్నాలజీ వివిధ అంశాలలో చోటుచేసుకుంటున్నఅధునాతన పరిణామాలను తెలుసుకోవడానికి తాము నిర్వహిస్తున్న జాతీయ స్థాయి సదస్సు అత్యంత ప్రోత్సాహకరంగా ఉంటుందన్నారు. వివిధ శాస్త్ర రంగాలకు సంబంధించిన సుమారు వంద పేపర్లు ఈ సదస్సులో ప్రవేశపెట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు.







