UPDATED 29th JUNE 2018 FRIDAY 9:00 PM
సామర్లకోట: సేంద్రియ వ్యవసాయం చేపట్టాలంటే పాడి పరిశ్రమ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ కె. శివాజీ తెలిపారు. ఆత్మ ప్రాజెక్ట్ డైరెక్టర్ పద్మజ ఆధ్వర్యంలో సామర్లకోట ప్రభుత్వ పశువైద్యశాలలో గొర్రెలు, మేకలు పెంపకందార్లకు నిర్వహించిన అవగాహనా సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆత్మ ప్రాజెక్టు ద్వారా తొలిసారిగా గొర్రెలు మేకల పెంపకానికి సంబంధించి రూ.30 లక్షలు నిధులు కేటాయించడం అభినందనీయమని, ఇప్పటికే రూ 4.36 లక్షల విడుదల చేయడం జరిగిందన్నారు. ఆత్మ ప్రాజెక్ట్ డైరెక్టర్ పద్మజ మాట్లాడుతూ జిల్లాలో తమ ప్రాజెక్టు ద్వారా 18 ఎడిఎలతో పాటు 23 మంది సభ్యులతో కూడిన కమిటీతో ప్రాజెక్టు కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం జరిగిందన్నారు. ఆత్మ ద్వారా అందిస్తున్న మందులను పెంపకందారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం వ్యాధినిరోధక టీకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మ డిపిడి డాక్టర్ సునీత, పశువైద్యులు, రాంబాబు, నమ్మి శ్రీనివాసు, రామన్న సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.







