UPDATED 19th JULY 2020 SUNDAY 9:00 PM
పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): భక్తుల పాలిట కొంగు బంగారంలా తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణంలో కొలువైఉన్న మరిడమ్మ అమ్మవారు శాకాంబరీ దేవిగా ఆదివారం భక్తులకు దర్శనమిచ్చారు. ఆషాడ మాస ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని వేద పండితుల మంత్రోచ్ఛరణలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ వివిధ రకాల కూరగాయలతో విశేషంగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయం ప్రత్యేక శోభను సంతరించుకుంటుంది. ఆలయప్రాంగణం అంతా పచ్చని కూరగాయలతో అలంకరించారు. వర్షాకాలం ప్రారంభమైన తరువాత కూరగాయలతో అమ్మవారిని అర్చించడం ద్వారా రైతులకు ఫలసాయం బాగా వచ్చి లోకమంతా సుభిక్షంగా ఉంటుందని, శాకాంబరీగా అమ్మవారిని దర్శించుకుంటే ఆహారానికి ఎలాంటి లోటుండదని పండితులు ఈ సందర్భంగా వివరించారు. కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులను అనుమతించినట్లు దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ కె. విజయలక్ష్మి తెలిపారు.







