UPDATED 20th SEPTEMBER 2019 FRIDAY 8:00 PM
సామర్లకోట(రెడ్ బీ న్యూస్) : సరైన పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉంటారని మున్సిపల్ కమీషనర్ ఎం. ఏసుబాబు, న్యూట్రిషన్ మేనేజర్ రామలక్ష్మి పేర్కొన్నారు. పోషణ అభియాన్, పోషణ మాసోత్సవాల్లో భాగంగా స్థానిక మెప్మా కార్యాలయంలో ఐసిడిఎస్, మెప్మా సంయుక్త ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలు, బాలింతలు పౌష్టికాహారంపై శుక్రవారం అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమీషనర్ ఏసుబాబు, మెప్మా న్యూట్రిషన్ మేనేజర్ రామలక్ష్మి మాట్లాడుతూ గర్భిణీలు సరైన పౌష్టికాహారం తీసుకోవాలని, అలా తీసుకోకపోతే పుట్టబోయే బిడ్డ తక్కువ బరువుతో జన్మించి అనారోగ్యం బారినపడే ప్రమాదం ఉంటుందని అన్నారు. గర్భం దాల్చినప్పటి నుంచి బిడ్డకు రెండేళ్ల వయస్సు పూర్తయ్యేంత వరకూ వెయ్యి రోజులవుతుందని, ఆ రోజుల్లో తల్లీబిడ్డలు పౌష్టికాహారం తీసుకోకపోతే జీవితంపై ప్రభావితం చూపుతుందని అన్నారు. రెండేళ్ల పిల్లల వరకూ పోషణ సరిగ్గా లేకపోతే రక్తహీనతకు గురవుతారని, పెద్దయిన తరువాత వివిధ రోగాల బారిన పడతారన్నారు. ఎదుగుదల, ఆరోగ్యం, చదువు, ఉత్పాదక శక్తిపై అది ప్రభావం చూపిస్తుందని పేర్కొన్నారు. ఈ విషయాలు దృష్టిలో ఉంచుకుని ప్రతీ ఒక్కరూ పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. ఆరోగ్యకర సమాజం కోసం ప్రతీ ఒక్కరూ పాటుపడాలని పేర్కొన్నారు. అనంతరం అంగన్వాడీలు ఏర్పాటు చేసిన పౌష్టికాహార ప్రదర్శనను వారు తిలకించారు. ఈ కార్యక్రమంలో సీడీపీవో టిడిఆర్ పద్మావతి, మెప్మా సిటీ మిషన్ మేనేజర్ కె. మోహన్ కుమార్, ఐసిడిఎస్ సూపర్ వైజర్లు, మెప్మా సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, గర్భిణీలు, బాలింతలు, తదితరులు పాల్గొన్నారు.







