UPDATED 2nd DECEMBER 2020 WEDNESDAY 7:00 PM
పెద్దాపురం (రెడ్ బీ న్యూస్): గ్రామ ప్రజల సంపూర్ణ ఆరోగ్యానికి సురక్షిత మంచినీరే ఆధారమని ఆర్.డబ్యు.ఎస్ డీఈఈ కెవిఎస్ చౌదరి పేర్కొన్నారు. మంచినీటి సరఫరా నిర్వహణ, పారిశుధ్యంపై నియోజకవర్గ పరిధిలోని పంచాయతీ కార్యదర్శులు, గ్రామ సచివాలయల ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, పంపు ఆపరేటర్లు, తదితరులకు స్థానిక ఎంపిడివో కార్యాలయంలో బుధవారం అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీఈఈ మాట్లాడుతూ ప్రజలకు సురక్షిత మంచినీటిని సరఫరా చేసేందుకు ప్రభుత్వం శాఖాపరంగా సూచించిన మార్గదర్శకాలను సంబంధిత అధికారులు తూచా తప్పకుండా అమలు చేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు కృషి చేస్తుందని అన్నారు. గ్రామాలలో మంచినీటి పైప్ లీకేజీలు, ఓవర్ హెడ్ క్లీనింగ్, చేతి పంపుల రిపేర్లు, శానిటేషన్ పనులను నిరంతరం సంబంధిత సిబ్బంది పర్యవేక్షించాలని తెలిపారు. మంచినీరు సరఫరా కలుషితంగా మారితే గ్రామ ప్రజలు అనారోగ్యానికి లోనవడమే కాకుండా సరియైన సమయంలో వైద్యం అందకపోతే మరణాలు కూడా సంభవిస్తాయని, దీనిని దృష్టిలో పెట్టుకుని మంచినీటి సరఫరాపై సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మంచినీటి సరఫరాకు ఆటంకాలు కలిగితే సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా హేండ్ పంపుల రిపేరు, ఓవర్ హెడ్ ట్యాంక్ క్లీనింగ్, పైపులైను లీకేజీ, తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సిబ్బందికి ఆయన అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్.డబ్ల్యూ.ఎస్ జెఈ అప్పలరాజు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, పంపు ఆపరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.







