UPDATED 12th SEPTEMBER 2018 WEDNESDAY 9:00 PM
సామర్లకోట: సామర్లకోట పట్టణంలో పెదబ్రహ్మదేవం శ్రీ శారదా రామకృష్ణ సేవాసమితి సభ్యులచే మట్టి వినాయక ప్రతిమల ఉచిత పంపిణీ కార్యక్రమం బుధవారం చేపట్టారు. ఈ సందర్భంగా సమితి గౌరవ సభ్యులు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత తోటకూర సాయిరామకృష్ణ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని, వాడవాడలా జరుగు వినాయక నవరాత్రి ఉత్సవాలలో మట్టి విగ్రహాలనే వినియోగించేలా స్వచ్చంద సంస్థలు, విద్యార్థులు కరపత్రాల ద్వారా అవగాహన కల్పించాలన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసిన వినాయక విగ్రహాలు, రంగులు, రసాయనాలు పూసిన విగ్రహాలను వాడటం, వాటిని నదులు, కాల్వలలో నిమజ్జనం చేయడం వల్ల పర్యావరణం విషతుల్యం అయి, తద్వారా అనేక వ్యాధులు సంభవించి, అనేక జీవరాసులు, మానవులకు ముప్పు వాటిల్లుతుందని అన్నారు. శ్రీ శారదా రామకృష్ణ సేవాసమితి ద్వారా చక్కటి కార్యక్రమం నిర్వహిస్తూ ప్రజలలో అవగాహన కల్గించడం అభినందనీయమని అన్నారు. అనంతరం ప్రజలకు వినాయక ప్రతిమలు, కరపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్, పట్టణ జర్నలిస్ట్ సంఘం అధ్యక్షులు అడపా వెంకట్రావు, సమితి అధ్యక్షులు తోటకూర గంగాధర్, సభ్యులు జోజిబాబు, కూనిరెడ్డి శ్రీనివాసరావు, జొన్నలగడ్డ పవన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.







