UPDATED 8th JULY 2018 SUNDAY 9:00 PM
సామర్లకోట: దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గొప్ప దార్శనికుడని, ఆ మహానేత ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే స్ఫూర్తిదాయకమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆవాల లక్ష్మీనారాయణ అన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 69వ జయంతి వేడుకలను సామర్లకోట పట్టణ, రూరల్ ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు. స్థానిక రాజీవ్ గృహకల్పలోని వైఎస్ విగ్రహానికి పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆవాల లక్ష్మీనారాయణ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత వైఎస్సార్‌దేనని అన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితే మళ్లీ రాజన్నయుగం వస్తుందని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మరపురాని పాలనతో ప్రజల హృదయంలో చెరగని ముద్ర వేసుకున్న మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అని అన్నారు. వైఎస్సార్ ఆశయాలు సాధించేందుకు ప్రతీ ఒక్కరూ నడుం బిగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలకు, రోగులకు రొట్టెలు పండ్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమాలలో పార్టీ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు మద్దాల శ్రీను, సేపేని సురేష్, జిల్లా కార్యదర్శి మేకా శ్రీను, కౌన్సిలర్ కాళ్ల లక్ష్మీనారాయణ, మాజీ కౌన్సిలర్ పితాని కృష్ణ, కానుబోయిన విజయకృష్ణ, కౌన్సిలర్ ఊబా జాన్ మోజస్, వసంతల ప్రసాద్, ఎలిజిబెత్ రాణి, భావి రమణ, ప్రత్తి సోమరాజు, భానుప్రసాద్, మాజీ కౌన్సిలర్ నేతల హరిబాబు, తదితరులు పాల్గొన్నారు.







