Updated 1st December 2022 10:05 pm
Tokay Gecko Lizard : బల్లి ఏంటి, కోటి రూపాయల ధర పలకడం ఏంటి? అని షాక్ అయ్యారు కదూ. అసలు, బల్లి అంటేనే అరిష్టం అంటారు. దాన్ని చూడటానికి కూడా ఇష్టపడరు. అలాంటిది కోటి రూపాయల ధర పలకడం అంటే కామెడీగా అనిపించొచ్చు. కానీ, ఇది నిజం. ఈ బల్లి మామూలు బల్లి కాదు. అరుదైన బల్లి. సాధారణంగా బల్లి అంటే అరిష్టం అంటారు. కానీ, ఈ బల్లి అరిష్టం కాదు అదృష్టం. ఎందుకంటే అది చాలా విలువైనది మరి.
వివరాల్లోకి వెళితే.. ఇది టోకే గెక్కో రకం బల్లి. చూడ్డానికి ప్లాస్టిక్ బల్లి లాగా ఉంటుంది. అంతరిస్తున్న జీవ జాతుల జాబితాలో ఉందీ బల్లి. ఇక, అంతర్జాతీయ మార్కెట్ లో దీని విలువ అక్షరాల కోటి రూపాయలు అంటే అతిశయోక్తి కాదు.
బీహార్‌లోని పూర్నియా జిల్లాలోని ఓ మెడికల్ స్టోర్‌లో ఈ అరుదైన టోకే గెక్కో బల్లిని, మత్తునిచ్చే దగ్గు సిరప్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది అంతరించిపోయిన తక్షక్ జాతికి చెందిన బల్లిగా అధికారులు వెల్లడించారు. వెస్ట్ బెంగాల్ నుంచి టోకే గెక్కో బల్లిని బీహార్‌కు తీసుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ బల్లిని ఢిల్లీకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేసినట్లు గుర్తించారు. ఈ ఘటనలో ఐదుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు.







