UPDATED 13th MAY 2018 SUNDAY 9:00 PM
సామర్లకోట: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన రెడ్డి ప్రజా సంకల్పయాత్ర రెండు వేల కిలోమీటర్లు చేరుకోవడంతో ఆయనకు మద్దత్తుగా రెండు రోజులు టిడిపి వంచనపై గర్జన పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పెద్దాపురం నియోజకవర్గ వైసిపి కో-ఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయుడు తెలిపారు. స్థానిక గణపతినగరంలోని కానుబోయిన విజయకృష్ణ స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాదయాత్ర ద్వారా ప్రజలతో మమేకమవ్వడం, సమస్యలను గుర్తించడం, శాస్త్రీయంగా అధ్యయనం చేసి ఆచరణయోగ్యమైన పరిష్కార మార్గాలను రూపొందించడం, తద్వారా దివంగత మహానేత వైఎస్సార్ సంక్షేమ రాజ్యాన్ని మళ్లీ తీసుకురావడం...ఈ లక్ష్యాలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్పయాత్ర స్ఫూర్తిదాయకంగా సాగుతోందన్నారు. ఆయన చేస్తున్నయాత్రకు మద్దత్తుగా టిడిపి ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించేందుకు టిడిపి వంచనపై గర్జన పాదయాత్ర కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. ఈ నెల 14 నుంచి ఈ పాదయాత్ర చంద్రపాలెం గ్రామం నుంచి ప్రారంభమై గొంచాల, అచ్చంపేట, బ్రహ్మానందపురం మీదుగా సామర్లకోట చేరుకొని మొదటి రోజు కార్యక్రమం పూర్తవుతుందని, 15వ తేదీ సామర్లకోట, పెద్దాపురం, గుడివాడ సిరివాడ మీదుగా కాండ్రకోటలో నూకాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద కార్యక్రమం ముగుస్తుందన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తయినా సరే ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని, ముఖ్యమంత్రికి చంద్రబాబుకి సద్బుద్ధిని ప్రసాదించమని కాండ్రకోట నూకాలమ్మ అమ్మవారిని వేడుకుని కొబ్బరికాయ కొట్టి ఈ కార్యక్రమం ముగించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి రాష్ట్ర కార్యదర్శి ఆవాల లక్ష్మీనారాయణ, రాష్ట్ర కార్యదర్శి కంటే వీర్రాఘవులు, పట్టణ అధ్యక్షుడు మద్దాల శ్రీను, మాజీ జడ్పీటీసీ బొబ్బరాడ సత్తిబాబు, జిల్లా కార్యదర్శి మేకా శ్రీను, కౌన్సిలర్ కాళ్ల లక్ష్మీనారాయణ, పట్టణ కోశాధికారి శెట్టిబత్తుల దుర్గ, టౌన్ సెక్రెటరీ, సేపేని సురేష్, జిల్లా సెక్రెటరీ మంచం సాయి, నేతల హరిబాబు, గంప శివ, పెద్దాపురం యూత్ ప్రెసిడెంట్ గోగు మురళి, తదితరులు పాల్గొన్నారు.







