UPDATED 18th JUNE 2019 TUESDAY 9:00 PM
రంగంపేట: సామర్లకోట-రాజానగరం మధ్య చేపట్టిన ఏడీబీ రోడ్డు విస్తరణ, భూసేకరణ, పరిహారం చెల్లింపు ప్రక్రియలను త్వరితగతిన పూర్తి చేసి పనుల నిర్వహణ కోసం భూమిని ఏజెన్సీకి అప్పగించాలని జిల్లా కలెక్టర్ డి. మురళీధరరెడ్డి రెవెన్యూ, ఆర్&బి అధికారులను ఆదేశించారు. ఏడీబీ రోడ్డు విస్తరణ పనులను జిల్లా కలెక్టరు మురళీధర్‌రెడ్డి మంగళవారం మధ్యాహ్నం పరిశీలించారు. రాజానగరం నుంచి రంగంపేట, గండేపల్లి, పెద్దాపురం మండలాల మీదుగా సామర్లకోట వరకు ఉన్న ఈ రోడ్డును పరిశీలించి పనుల పురోగతిని జిల్లా జాయింట్ కలెక్టర్ -2 సిహెచ్ సత్తిబాబు, రాజమహేంద్రవరం సబ్-కలెక్టర్ సాయికాంత వర్మ, పెద్దాపురం ఆర్డీవో ఎన్.ఎస్.వి.బి. వసంతరాయుడుతో చర్చించారు. రంగంపేట గ్రామంలో రోడ్డు విస్తరణకు భూసేకరణ కారణంగా జనావాసాలకు ఏమేరకు ప్రభావం ఉంటుందనే అంశాన్ని జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. సేకరించిన భూములకు చెల్లింపులు జరిపేందుకు బిల్లులు ఆమోదంలో ఏమైనా సమస్యలు ఎదురైతే రాష్ట్రస్థాయిలో చర్చిస్తామని అన్నారు. అప్పగించిన భూములలో రోడ్డు విస్తరణ పనులు నాణ్యతతో త్వరితగతిన నిర్వహించాలని ఇంజినీర్లు, కాంట్రాక్టు ఏజెన్సీలను ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీసీ ఈఈ జాన్ సుధాకర్, రంగంపేట తహసీల్దార్ ఇందిరాగాంధీ, కాంట్రాక్టు ఏజెన్సీ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.







