: ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకరావు
UPDATED 3rd OCTOBER 2018 WEDNESDAY 9:00 PM
సామర్లకోట: దళితుల అభ్యున్నతి కలలుగన్న అంబేద్కర్ ఆశయాలను, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆచరణలోకి తెస్తున్నారని ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకరావు అన్నారు. స్థానిక అచ్చంపేట సమీపంలోని లక్ష్మీపరిణయ ఫంక్షన్ హాలులో ఎస్సీ కార్పోరేషన్, జిల్లా పరిశ్రమల కేంద్రం ఆధ్వర్యంలో జిల్లాలోని షెడ్యూల్డ్ కులాల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు బుధవారం అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకరావు ముఖ్య అతిధిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ కార్పోరేషన్ ద్వారా ఈ ఏడాది రూ.2,344 కోట్ల నిధులతో లక్షా 25 వేల ఎస్సీ కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తున్నామని తెలిపారు. షెడ్యూల్ కులాల ప్రజలకు వినూత్న పథకాలను అమలుచేస్తూ ఎస్సీ కార్పోరేషన్ దేశంలో ఐఎస్ఓ సర్టిఫికేషన్ పొందిన సంస్థగా నిలిచిందన్నారు. ఈ సంవత్సర వార్షిక ప్రణాళిక క్రింద రూ.2344 కోట్ల నిధులతో లక్షా 25వేల ఎస్సీ కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తున్నామని, ఇందులో రూ.1266 కోట్ల సబ్సిడీ, రూ.650 కోట్ల బ్యాంకు రుణాలు, రూ.429 కోట్లు ఇతర ఆర్థిక సంస్థలు, శాఖల సబ్బిడీ ఉందన్నారు. లబ్దిదారుల సమగ్ర ఆర్థికాభ్యున్నతి లక్ష్యంగా యూనిట్ వ్యయాన్ని రూ.20 వేల నుంచి రూ.40 లక్షల వరకూ పెంచామని, ఈ సంవత్సరం 500 ఇన్నోవా కార్లు, 500 ట్రాక్టర్లు, 660 డ్రైనేజీ క్లీనింగ్ వాహన యూనిట్లు, 7500 ఈ-ఆటోలు పంపిణీ చేస్తున్నామన్నారు. దళితవాడల అభివృద్ధి, ఎస్సీల ఉన్నత విద్యా, ఉపాధి శిక్షణ వంటి కార్యక్రమాలతో పాటు భూమి కొనుగోలు పధకం ద్వారా ఎస్సీలకు సామాజిక హోదా కల్పిస్తున్నామని, ఇందుకు రూ. 135 కోట్ల నిధులతో మూడు వేల ఎకరాలు కొనుగోలు చేపట్టామన్నారు. అలాగే రూ.163 కోట్ల నిధులతో 16 వేల మంది విద్యావంతులైన యువతకు వివిధ రంగాలలో ఉద్యోగ అవకాశాల కొరకు నైపుణ్యాల అభివృద్ధి శిక్షణ నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రభుత్వ పధకాలను లబ్దిదారులు సద్వినియోగం చేసుకుని ఆర్థికం ఎదగాలని, అలాగే తోటి వారిని కూడా చైతన్యపరచి ఈ పధకాలు అందేలా చూడాలన్నారు. ఎస్సీ కార్పోరేషన్ ద్వారా యూనిట్లు పొందిన లబ్దిదారులు బ్యాంకు రుణాలను సక్రమంగా, సకాలంలో తిరిగి చెల్లించాలని, తద్వారా మరింత మంది తోటి వారికి కార్పోరేషన్ పధకాలు, బ్యాంకురుణాలు పొందేందుకు దోహదం కావాలని ఆయన కోరారు. ఎస్సీ కార్పోరేషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా తూర్పు గోదావరి జిల్లాలో వెయ్యి మందికి ఈ అవగాహన కల్పించడం జరుగుతోదన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా ఉదయం ఎస్సీ కార్పోరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పోరేషన్ డైరక్టరు కాశీ నవీన్ కుమార్, ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ వి. డేవిడ్ రాజు, ఇవో డాక్టర్ ఎన్. కిషోర్, ఈడిపి మోటివేటర్ ప్రొఫెసర్ నాగరాజు, జిల్లా పరిశ్రమల కేంద్రం డిడి డేవిడ్ సుందరం, ఎల్.డిఎం బి.వి. సుబ్రమణ్యం, విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ కమిటీ సభ్యులు కళ్యాణం కోటేశ్వరరావు, పలివెల సత్యానందం, డిసిసిబి డైరక్టర్ గుడాల రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.







