UPDATED 4th JULY 2020 SATURDAY 8:00 PM
కాకినాడ(రెడ్ బీ న్యూస్): జిల్లాలో భూసేకరణ ప్రక్రియలో భాగంగా స్థానిక మార్కెట్ ధరలు ఆధారంగా భూముల ధర నిర్ణయించేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డి. మురళీధర్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్ కార్యాలయం నుంచి జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డాక్టర్ జి. లక్ష్మీశ, డిప్యూటీ ఇనస్పెక్టర్ జనరల్ (రిజిస్ట్రేషన్) సరోజతో కలిసి సబ్-కలెక్టర్, ఆర్డీవోలు, మున్సిపల్ కమీషనర్లు, సబ్ రిజిస్ట్రార్లతో కలిసి జూమ్ యాప్ ద్వారా శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలు, పేదలందరికీ ఇళ్ళు పంపిణీలో భాగంగా జిల్లాలో భూసేకరణ చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో పట్టణ, గ్రామీణ ప్రాంతాలతో పాటు ఆయా ప్రాంతాల అభివృద్ధి పరంగా ఒక్కో ప్రాంతంలో భూముల ధరలు వేరువేరుగా ఉంటున్నాయని, వీటిని దృష్టిలో పెట్టుకొని భూమి మార్కెట్ ధర, ప్రభుత్వం నిర్ణయించిన ధరలను బేరీజు వేసి సరాసరి ఒక ధరను నిర్ణయించి ప్రభుత్వానికి నివేదికలు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఇందులో భాగంగా డివిజన్ స్థాయిలో ఆర్డీవోలు, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమీషనర్లు, సబ్-రిజిస్ట్రార్లతో సమన్వయం చేసుకొని ప్రతిపాదనలు పంపాలని ఆయన ఆదేశించారు.







